Paris Olympics 2024:  విశ్వ క్రీడలకు సర్వం సిద్ధమైంది. అధికారికంగా రేపు పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics) 2024 ప్రారంభం కానుండగా భారత్‌(India) మాత్రం ఒకరోజు ముందే అంటే ఇవాళే పతక వేటను ప్రారంభించనుంది. పతక అంచనాలు భారీగా ఉన్న ఆర్చరీ విభాగంలో నేడు ఇండియా విశ్వ క్రీడలను ప్రారంభించనుంది. ప్రతీ ఒలింపిక్స్‌లో ప్రదర్శన మెరుగుపరచుకుంటూ అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటుతున్న భారత అథ్లెట్లు... ఈ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ ఒలింపిక్స్‌లో టాప్‌ 30లో నిలవడమే లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతోంది.




 

అమెరికాను దాటగలదా...?  

ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల పట్టికలో టాప్ 30లో ఉండాలని భావిస్తోంది. ఈ సారి పతకాల పట్టికలో అమెరికా(USA) అగ్రస్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. చైనా(China) అథ్లెట్లు అగ్రస్థానంపై కన్నేసినా... అమెరికాను దాటి టాప్‌ లేపడం అంత తేలికైన పని కాదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. అమెరికాను దాటకపోయినా గతంతో పోలిస్తే చైనా స్వర్ణ పతాకాల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఒలింపిక్‌లో అగ్ర స్థానం సాధించి అమెరికా తర్వతా అగ్రరాజ్యం అయ్యే అవకాశం తమకే ఉందని ప్రపంచానికి చాటి చెప్పాలని చైనా భావిస్తోంది.

 

ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే...

భౌగోళికంగా రాజకీయంగా ఆర్థికంగా తాము ఎంతో బలంగా ఉన్నామని... క్రీడల్లోనూ తమదే ఆధిపత్యమని చాటాలని డ్రాగన్‌ భావిస్తోంది. ఈసారి విశ్వ క్రీడల్లో అమెరికా మొత్తం 39 స్వర్ణాలు, 32 రజతాలు, 41 కాంస్యాలతో 112 పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలవవచ్చని అంచనా వేస్తున్నారు. చైనా 34 స్వర్ణాలు, 27 రజతాలు, 25 కాంస్యాలతో 86 పతకాలు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా, చైనా వరుసగా ఒకటి, రెండో స్థానంలో నిలిచాయి. అయితే ఒలింపిక్‌ కమిటీ అధికారికంగా ఎలాంటి ర్యాంకింగ్‌లను ఇవ్వదు. అయితే ఒక దేశం సాధించిన బంగారు పతకాల ఆధారంగా పతకాల జాబితాను రూపొందిస్తారు. ఈసారి కూడా అమెరికా అగ్రస్థానంలో ఉంటే ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదోసారి టాప్‌లో నిలిచిన దేశంలో అమెరికా రికార్డు సృష్టిస్తుందియ 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్‌లో సోవియట్ యూనియన్‌కు చెందిన అథ్లెట్‌లతో కూడిన జట్టు చివరిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. 

 

టాప్‌ 30లో భారత్ ఉంటుందా... గతంలో ఏం జరిగింది!

2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 19 పతకాలు సాధించి 18వ స్థానంలో నిలుస్తుందని అంచనా వేసినా ఈ అంచనాలు తప్పాయి. ఇండియా కేవలం ఏడు పతకాలను గెలుచుకుని 48వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 117 మంది సభ్యులతో బరిలోకి దిగుతోంది. ఈసారి భారత్‌ పతకాల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి భారత్‌ కచ్చితంగా టాప్‌ 30లో నిలిచే అవకాశం పుష్కలంగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌, అర్చరీల్లో పతక ఆశలు ఉన్నాయి.