కథ ముగిసినట్టే! ఆశలు ఆవిరైనట్టే! పురుషుల ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. దేశంలో ఉండేందుకు అనుమతి నిరాకరించింది. దాంతో అతడు ఆస్ట్రేలియా ఓపెన్‌పై ఆశలు వదిలేసుకోక తప్పట్లేదు.
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి! ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలన్న అతడి కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆసీస్ ప్రభుత్వం రెండోసారీ అతడి వీసాను రద్దు చేసింది. కోర్టు అందుకు మద్దతు తెలిపింది.
ఆదివారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందుకు జకోవిచ్ వచ్చాడు. ప్రభుత్వం తన వీసా రద్దు చేయడంలో అర్థం లేదని జకోవిచ్ తరఫున న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించలేకపోయారు. వారి వాదనను కోర్టు తోసిపుచ్చింది. దాంతో అతడు సెర్బియాకు పయనం కాక తప్పదు.
ఏం జరిగిందంటే!
ఆస్ట్రేలియాలో కొవిడ్ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. టీమ్‌ఇండియా సైతం అక్కడ పర్యటించినప్పుడు క్వారంటైన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్సలు మినహాయింపులే ఇవ్వడం లేదు. అయితే పాజిటివ్ వచ్చిన వాళ్లు వైద్య ధ్రువీకరణ పత్రం చూపిస్తే దేశంలోని అనుమతి ఇస్తున్నారు. కానీ జకోవిచ్ అలాంటి పత్రం ఇవ్వలేదు. అతడికి అవమానం జరిగిందటూ సొంత దేశం సెర్బియా సహా మిగతా ప్రపంచమూ అతడికి వంత పాడింది.
తీరా దర్యాప్తు చేస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి! గతేడాది డిసెంబర్ 16న జకోవిచ్‌కు కొవిడ్ సోకింది. దాంతో 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాడు. అక్కడే అతడు తప్పు (ఉద్దేశపూర్వకమా!) చేశాడు. ఐసోలేషన్లో ఉంటే ఎవరినీ కలవొద్దు. అలాంటిది అతడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఓ విలేకరినీ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడని తెలిసింది. దాంతో అతడు కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించాడని అర్థమైంది. ఇదిప్పుడు చినికి చినికి గాలివానగా మారింది. దాంతో 'మానవ తప్పిదం' సహజమేనంటూ నొవాక్ కొత్త పాట అందుకున్నాడు.
సోమవారమే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు జకోవిచ్‌ను విమానాశ్రమంలో నిలిపివేశారు. అతడికి మద్దతుగా అభిమానులు, సెర్బియా ప్రభుత్వం నిలిచింది. ప్రపంచ నంబర్ వన్‌ను అవమానిస్తారా అంటూ విమర్శించింది. ఈ లోపు జకోవిచ్ కోర్టుకు వెళ్లి ఊరట తెచ్చుకున్నాడు. అయినప్పటికీ ఆసీస్ విదేశాంగ మంత్రి అలెక్స్ ఊరుకోలేదు. ప్రత్యేక అధికారంతో రెండోసారి వీసా రద్దు చేసేశారు. 'వలస చట్టంలోని 133C(3) సెక్షన్ ప్రకారం నేనీ రోజు ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను. ప్రజా ప్రయోజనార్థం నొవాక్ జకోవిచ్ వీసాను రద్దు చేశాను. మొదటి వీసా రద్దును ఫెడరల్ కోర్టు కొట్టివేసిన తర్వాత నేనీ నిర్ణయం తీసుకున్నా. జకోవిచ్, ఆస్ట్రేలియా సరిహద్దు దళం, హోం మంత్రిత్వ శాఖ సమాచారం పరిగణనలోకి తీసుకున్నా. కొవిడ్ విషయంలో మోరిసన్ ప్రభుత్వం కఠినంగా ఉంది' అని హాక్ తెలిపారు.
అతడు మరోసారి కోర్టు తలుపులు తట్టే అవకాశం ఉన్నప్పటికీ తీర్పు అనుకూలంగా రాదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా తీసుకోని జకోవిచ్ సమాజంలో కొవిడ్ వ్యాప్తికి కారకుడయ్యే అవకాశం ఉందంటూ అక్కడి విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతడి వీసాను రద్దు చేశారు. అంటే అతడికి మరో మూడేళ్ల వరకు ఆస్ట్రేలియాలో ప్రవేశం లేనట్టే! కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం అనుమతించొచ్చు.
కల చెదిరే
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెన్‌ను జకోవిచ్ తొమ్మిదిసార్లు గెలిచాడు. మరోసారి గ్రాండ్‌స్లామ్ గెలిచి అత్యధిక సార్లు గెలిచిన వీరుడిగా నిలుద్దామనుకున్నాడు. అంతేకాకుండా చాలా కాలంగా ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్ సాధించాలని కలలు కన్నాడు. ఆస్ట్రేలియా ఒకే నెలలో రెండోసారీ వీసా నిరాకరించినా అక్కడే మొండిగా ఉన్నాడు. కోర్టు తలుపులు తట్టాడు.
Also Read: ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్ డోన్ట్ వర్రీ ప్లీజ్!!
Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!
Also Read: షాక్..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్ చెబుతూ లేఖ