Smriti Mandhana craze in Sri Lanka: అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లకు ఉండే క్రేజే వేరు! ఒకప్పుడు పురుష క్రికెటర్ల కోసం అమ్మాయిలు ఎగబడేవారు. వారిపై ఉన్న క్రష్‌ను అందంగా ప్రదర్శించేవారు. ఫ్లకార్డులు, పోస్టర్లలో విచిత్రమైన కొటేషన్లు రాసి తీసుకొచ్చేవారు. ఇప్పుడా క్రేజ్ అమ్మాయిల పైకి మళ్లింది! భారత్, శ్రీలంక మహిళల టీ20 మ్యాచే ఇందుకు ఉదాహరణ!
దంబుల్లా వేదికగా శనివారం శ్రీలంక, భారత్ రెండో టీ20లో తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధానపై ఓ యువకుడు విచిత్రంగా తన క్రష్‌ను వ్యక్తపరిచాడు. 'పెట్రల్ లేకపోయినా సరే స్మృతి మంధానను చూడటానికి వచ్చాను' అని పోస్టర్‌పై రాశాడు. స్మృతిపై అతడు చూపించిన ఇష్టానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు.
Also Read: దటీజ్ విరాట్ కోహ్లీ! ఆగ్రహంతో ఇండియన్ ఫ్యాన్స్‌నీ తిట్టేశాడు!!
Also Read: అతనాడితే స్కోరు బోర్డే పరుగెడుతుందన్న రవిశాస్త్రి!
ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దివాలా దిశగా పయనిస్తోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఒక కోడిగుడ్డును రూ.50 వరకు అమ్ముతున్నారు. కిలో కోడి కూరైతే రూ.1000 వరకు చెల్లించాల్సిందే. పాల నుంచి అనేక నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. పెట్రోలు సైతం లేకపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ముడి చమురు దిగుమతి చేసుకొనేందుకు విదేశీ మారక ద్రవ్యం లేకపోవడమే ఇందుకు కారణం. అంత విలువైంది కాబట్టి ఆ యువకుడు పెట్రోల్ కొటేషన్ వాడాడు!
టీమ్‌ఇండియా క్రికెటర్ స్మృతి మంధానకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం, ఆఫ్ సైడ్ అందమైన కవర్ డ్రైవులు ఆడటం, భారీ సిక్సర్లు బాదడంతో అభిమానుల సంఖ్య పెరిగింది. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, ఇంగ్లాండ్‌లో ది హండ్రెడ్, టీ20 బాష్ వంటి లీగుల్లో ఆడటంతో ప్రపంచం మొత్తానికీ ఆమె తెలుసు. అందుకే ఆమె ఆడితే చాలామంది టీవీలకు కళ్లప్పగిస్తుంటారు.
ఇక మ్యాచు విషయానికి వస్తే టీమ్‌ఇండియా ఈ సిరీసును 2-0తో కైవసం చేసుకుంది. మొదట లంకేయులు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేశారు. కష్టతరమైన పిచ్‌పై భారత్ లక్ష్యఛేదనను ధాటిగా ఆరంభించింది. 19.1 ఓవర్లకు 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఓపెనింగ్‌లో స్మృతి మంధాన (39; 34 బంతుల్లో 8x4) దంచికొట్టింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (31*; 32 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచింది.