దేశమేదైనా? స్టేడియం ఎక్కడైనా? అభిమానులు ఎవ్వరైనా? టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కింగే!! తన సహచరులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అతడు ఎదురు నిలుస్తాడు. మొక్కవోని ఆత్మవిశ్వాసం అందిస్తాడు. ఎవ్వరితోనైనా గొడవపడతాడు. లీసెస్టర్ షైర్‌తో (IND vs LEIC) మ్యాచులోనూ ఇలాగే చేశాడు.
ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకోసం టీమ్‌ఇండియా (Team India) అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచుకు హిట్‌మ్యాన్ సేన కఠినంగా సిద్ధమవుతోంది. లీసెస్టర్ షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఆటగాళ్లంతా కష్టపడుతున్నారు. ఆటలో రెండో రోజు ఓ ఘనట చోటు చేసుకుంది. నెట్‌బౌలర్‌గా వెళ్లిన కమలేశ్ నాగర్‌కోటిని (Kamalesh Nagarkoti) భారతీయ అభిమానుల్లో కొందరు దూషించారు. సాధన మ్యాచులో అతడి ప్రదర్శనను ఎద్దేవా చేశారు.
మ్యాచ్ సాగుతుండగా కమలేశ్ నాగర్ కోటిని పదేపదే దూషించడాన్ని విరాట్ కోహ్లీ గమనించాడు. వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బాల్కనీలోకి వచ్చాడు. అక్కడి నుంచే అభిమానులను మందలించాడు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'కమలేశ్ ఇక్కడికి ఆడటానికి వచ్చాడు. మీ కోసం రాలేదు' అంటూ గట్టిగా హెచ్చరించాడు. అభిమానుల్లోనే కొందరు ఈ వీడియోను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది.
గతంలోనూ విరాట్ కోహ్లీ తన సహచరులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీని మతం పేరుతో పాకిస్థాన్ మద్దతు దారులు దూషించడంతో కోహ్లీ అతడికి అండగా నిలిచాడు. సిరాజ్ వంటి వారికి ధైర్యాన్నిచ్చాడు.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 268/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బదులుగా లీసెస్టర్‌షైర్ 244కు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 38 ఓవర్లకు 134/4తో ఉంది. కేఎస్ భరత్, రిషభ్ పంత్ తొలి ఇన్నింగ్సుల్లో 70+ స్కోర్లు చేసిన ఆకట్టుకున్నారు.