సహాయక శిబిరాల్లోనే పిల్లలకు వ్యాయామం, డ్రాయింగ్స్


అసోంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లన్నీ నీట మునిగి పోవటం వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. నగావ్ జిల్లాలోని ప్రజల కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. నేషనల్ హైవేలపైనే గుడారాలు వేసుకుని ఉండాల్సి వస్తోంది. చాలా మంది బాధితులు ఇలా జాతీయ రహదారులపైనే షెల్టర్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రహా అసెంబ్లీ నియోజకవర్గంలోని 155 గ్రామాల్లో లక్షన్నర మందిపై వరద ప్రభావం పడినట్టు అధికారులు చెబుతున్నారు. విశ్రాంత శిబిరాల్లో చిన్నారులూ ఉన్నారు. వారికి భయం కలగకుండా, ఆ శిబిరాల్లోనే ప్రీ స్కూల్ యాక్టివిటీస్‌ చేయిస్తున్నారు. ఉదయం ప్రార్థనలు..తరవాత వ్యాయామం, డ్రాయింగ్స్‌ లాంటి యాక్టివిటీస్‌ చేయిస్తున్నారు. కేంద్ర మంత్రి సర్బనంద సోనోవాల్ ఇటీవలే ఈ క్యాంప్‌ని సందర్శించి...సహాయక చర్యల్ని సమీక్షించినట్టు ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. 


భారీ వర్షాలు తప్పవా..? 


అసోం డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ లెక్కల ప్రకారం...రాష్ట్రంలో దాదాపు 28జిల్లాల్లోని 33 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. 
రెండున్నర లక్షల మందికి పైగా బాధితులు 1, 126 సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 
118కి పెరిగింది. సిల్చార్ పట్టణం ఇంకా నీళ్లలోనే ఉంది. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 5-8 అడుగుల లోతు మేర నీళ్లు నిలిచిపోయాయి. మళ్లీ వర్షాలు కురవకపోయినప్పటికీ ఈ నీటిమట్టం మాత్రం తగ్గటం లేదు. బరాక్ నది కట్ట తెగిపోవటం వల్లే ఈ స్థాయిలో నీళ్లు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలంతటా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో జూన్ 28 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, అసోం పోలీసులతో పాటు కొందరు స్వచ్ఛందంగా వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు.