నిత్యం రద్దీగా ఉండే విశాఖ గురుద్వారా జంక్షన్‌లో ఏర్పాటైన స్మార్ట్ ఇన్ హోటల్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అయింది. నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్న ఈ హోటల్ మరికొద్ది రోజుల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే.. బిల్డింగ్ మొత్తం సోలార్ ప్యానెళ్లతో ఏర్పాటు చెయ్యడమే. సడన్‌గా చూస్తే మామూలు అద్దాల‌్లా కనపడే ఈ ప్యానెళ్ల హోటల్‌కు సరిపడా కరెంట్ నిరంతరం సప్లై చేస్తూనే ఉంటాయి. పర్యావరణానికి మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఈ సోలార్ హోటల్ ఏర్పాటు చేసినట్టు హోటల్ యజమాని బాబ్జీ చెబుతున్నారు. ఇక ఈ హోటల్ తనకు సరిపడా కరెంట్‌ను వినియోగించుకోగా.. మిగిలిన కరెంట్‌ను ఏకంగా గవర్నమెంట్‌కే అమ్మడం అసలైన విశేషం.




 

ఈ హోటల్‌లో అన్నీ కరెంట్ అవసరం లేకుండానే పనిచేసేస్తాయి

 




అయిదు అంతస్తుల ఈ స్మార్ట్ హోటల్ భవనానికి మొదటి అంతస్తు నుంచి భవంతి పైవరకూ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇవి భవనానికి అదనపు అందాన్ని కూడా ఇచ్చాయి. ఇక ఈ ప్యానెల్స్ రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని బాబ్జి  అంటున్నారు. నెట్ మీటరింగ్ ద్వారా వినియోగం తరువాత మిగిలిన విద్యుత్తును ఈ హోటల్ గ్రిడ్ కు అందిస్తుంది. దీని ద్వారా వారికి అదనంగా ఆదాయం కూడా లభిస్తుంది. ఎలివేషన్ కోసం నలుపురంగు అద్దాలకు బదులు.. ఈ సోలార్ ప్యానళ్లను బిగించటం వల్ల అదనంగా కొంత ఖర్చయినా కొత్తదనంతోపాటు అదనపు ఆదాయం కూడా రానుందనీ దీనివల్ల పెట్టిన అదనపు ఖర్చు కూడా వెనక్కిి వచ్చేయడంతోపాటు లాభం కళ్ళ చూస్తామని బాబ్జీ చెబుతున్నారు.

 

ఈ కాన్సెప్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేదని తొలిసారిగా తామే అందుబాటులోకి తెచ్చామని బాబ్జీ అంటున్నారు. లిఫ్ట్, టీవీ, ఏసీ, ఫ్యాన్స్, లైట్స్.. ఇలా హోటల్ లోని ప్రతీ ఎలెక్ట్రిక్ వస్తువూ ఈ సోలార్ కరెంట్ వల్లే పనిచేస్తుంది అనీ.. అదీ ఎలాంటి కరెంట్ బిల్లు లేకుండా అని ఆయన చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్ లకు కాస్త తక్కువ రేట్లలోనే హోటల్ గదులను ఇచ్చే ఆవకాశం కలుగుతుంది అనీ, భవిష్యత్ హోటల్ రంగానికి ఇదో విప్లవాత్మకైన పరిణామం అని బాబ్జి చెబుతున్నారు.

 


పర్యావరణ పరిరక్షణే అసలు ధ్యేయం :


 

మొత్తం మీద వేగంగా జరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో వ్యాపార దృక్పథాన్ని పర్యావరణ పరిరక్షణ అనే స్పృహ కూడా ఎంత అవసరమో వైజాగ్ లోని ఈ స్మార్ట్ ఇన్ హోటల్ చెబుతోంది.