ప్రస్తుతం టాలీవుడ్‌లో విరాట పర్వం ఒక హాట్ టాపిక్ అయింది. కమర్షియల్‌గా ఎంత వసూలు చేసింది అన్నది పక్కన పెడితే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి, రాణా, దర్శకుడు వేణు ఊడుగులకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. 90వ దశకంలో కోవర్ట్ ఆపరేషన్‌లు ఎలా జరిగేవి అన్నది ఈ సినిమా చూపెట్టింది. పోలీసులు కొంతమంది నక్సలైట్‌లను తమకు అనుకూలంగా మార్చుకుని ఎలా ఇతర నక్సలైట్‌ల సమాచారం రాబట్టేవారు లాంటి అంశాలను ఈ సినిమా మరోసారి గుర్తుచేసింది.

90ల్లోనే సరిగ్గా దీనిని మరో వెర్షన్‌లో చూపిన సినిమా ఒకటి ఉందని నేటి తరానికి తెలియకపోవచ్చు. కమల్ హాసన్, యాక్షన్ కింగ్ అర్జున్, కే . విశ్వనాథ్‌ లాంటి ఉద్దండులు నటించిన ఆ సినిమానే "ద్రోహి ". 

 

అసలు మాతృక "ద్రోహ కాల్ " :

 

1994 లో హిందీ దిగ్గజ దర్శకుడు గోవింద్ నిహ్లానీ తాను తీసిన 'ద్రోహ కాల్"  సినిమా స్క్రీనింగ్ కోసం ప్రముఖ కెమెరా మెన్ పీసీ శ్రీరామ్, కమల్ హాసన్‌ను ముంబైకి పిలిచారు. ఆ సినిమా చూసిన కమల్ దాన్ని రీమేక్ చెయ్యాలని భావించి రైట్స్ తీసుకున్నారు. హిందీ సినిమాలో ఓంపురి, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి లాంటి లెజెండ్స్ నటించగా విలన్‌గా ఆశిష్ విద్యార్థి తన కెరీర్ టర్నింగ్ పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుత ప్రముఖ నటుడు మనోజ్ బాజపేయ్ ఓ చిన్న పాత్రలో నటించారు.

 

ఈ సినిమాను తెలుగు తమిళాల్లో తీయాలని భావించిన కమల్ హాసన్ స్క్రీన్ ప్లేను కాస్త మార్చారు. దీనికి తమిళ్‌లో కురుతి పునాల్ (రక్త నది ) అనీ, తెలుగులో ద్రోహి అనీ పేరు పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు పీసీ శ్రీరామ్ కె అప్పగించగా కమల్‌తోపాటు ఈ సినిమాలో అర్జున్, కె .విశ్వనాథ్‌ లతోపాటు విలన్‌గా నాజర్ నటించారు. సినిమాలో ఎక్కడా డ్యూయెట్ అనేది ఉండదు. 

 

సరిగ్గా విరాట పర్వం కు రివర్స్ లో ఉండే కథాంశం  :

 

నక్సలైట్ గ్రూపుల్లో (సినిమా లో సెన్సార్ సమస్యల వల్ల తీవ్రవాద గ్రూపుల్లో అని మార్చారు ) ఇద్దరు కోవర్టులను "ఆపరేషన్ ధనుష్" పేరుతొ  ప్రవేశ పెడతారు పోలీస్ ఆఫీసర్లు ఆదినారాయణ (కమల్ ), అబ్బాస్ (అర్జున్ ). అలాగే అనుకోకుండా ఒక ఆపరేషన్లో నక్సలైట్ నాయకుడు భద్రను పట్టుకుంటారు కానీ తానే భద్ర అని వారికి తెలియదు. ఈ లోపు ఆఫీసర్లుగా హై లెవెల్ మీటింగ్స్‌లో జరిగే ప్రతి సమాచారం తీవ్రవాదులకు తెలుస్తుంది. దానివల్ల ఏకంగా ఒక కేంద్రమంత్రినే వారు చంపేస్తారు. అనంతరం జరిగే ఇన్వెస్టిగేషన్‌లో తాము అరెస్ట్ చేసింది భద్రను అనీ, ఆ గ్రూప్‌నకు సమాచారం ఇచ్చేది తమ బాస్ శ్రీనివాసన్ (కే .విశ్వనాధ్ ) అనీ తెలుసుకుంటాడు ఆదినారాయణ. సీబీఐ ఆఫీసర్లు వచ్చేసరికి శ్రీనివాసన్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తరువాత భద్ర తప్పించుకుపోవడంతో పాటు ఆదినారాయణను కూడా బ్లాక్ మెయిల్ చేసి తమ కోవర్టుగా మారమంటాడు. అలాగే "ధనుష్" ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అబ్బాస్‌ను కూడా చంపేస్తాడు భద్ర. ఆదినారాయణ ఇంట్లో తన మనుషులను పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతాడు. చివరకు ఇవన్నీ తట్టుకోలేక భద్రను చంపేస్తాడు ఆదినారాయణ. అలాగే ధనుష్ ఉనికి బయటపడకుండా ఉండడం కోసం తాను కోవర్ట్‌గా నక్స లైట్‌లలో ప్రవేశ పెట్టిన శివతో తనను చంపేసి, గ్రూపుకు నాయకుడు కమ్మని కోరతాడు . తమ లక్ష్యం బతకడం కోసం అలానే చేస్తాడు శివ. ఆదినారాయణ చనిపోవడం, పోలీస్ కోవర్ట్ శివ ఆ గ్రూప్‌నకు నాయకుడు కావడంతో సినిమా ముగుస్తుంది. రాజకీయం, హింస కలిసి తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు, తుపాకితో తమదైన రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే వారూ ఆ తుపాకులకే బలైపోయేలా చేస్తున్నాయంటూ సినిమా ముగుస్తుంది . 

 

తమిళ్‌లో సూపర్ హిట్ - తెలుగులో ప్లాప్  :

 

ఈ సినిమా ముందుగా తమిళ్‌లో 1995 అక్టోబర్ 23 న తమిళ్‌లో రిలీజ్ అయింది. అదే టైంలో విడుదలైన రజనీకాంత్ ముత్తు ప్రభంజాన్ని తట్టుకుని మరీ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా మేకింగ్‌లో , స్క్రీన్‌ప్లేలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. అయితే తెలుగులో మాత్రం ప్లాప్ అయింది. కారణం దీని రిలీజ్ టైం.  తమిళ్ వెర్షన్ తోపాటే కాకుండా తెలుగులో ఈ సినిమాను 1996 జులై ఏడున రిలీజ్ చేసారు . దీనికి సరిగ్గా రెండు నెలలముందు కమల్ సినిమానే "భారతీయుడు " రిలీజ్ అయింది. అది బ్లాక్ బస్టర్ కావడం, కమల్ ఇమేజ్ తెలుగులో పెరిగిపోవడంతో ద్రోహి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. పైగా యాక్షన్ హీరోగా టాప్ గేర్ లో ఉన్న అర్జున్‌కి అసలు ఫైట్‌లే లేకపోవడం సినిమా మధ్యలోనే చనిపోవడం లాంటివి మనవాళ్లకు రుచించలేదు. దానితో ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. అయితే ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి బెస్ట్ ఫారీన్ ఫిల్మ్ గా అధికారిక ఎంట్రీగా వెళ్ళింది. 

 

హీరో ధనుష్ పేరు మార్చిన సినిమా ఇది :

 

ఈ సినిమా తమిళ్‌లో ఎంతటి ప్రభావం చూపిందంటే గౌతం వాసుదేవ్ మీనన్, ఏఆర్ మురుగదాస్  తమను ఇన్స్పైర్ చేసిన సినిమాగా దీనిని చెబుతారు. ఈ సినిమాలోని సీన్లు, డైలాగ్స్‌ని తమ సినిమాల్లో అక్కడక్కడా వాడామని  వారే స్వయంగా కితాబునిచ్చారు. అప్పటికి పిల్లవాడైన వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా అనే నటుడు తాను సినిమాల్లోకి వచ్చాక స్క్రీన్ నేమ్ గా ఈ సినిమా లో ఆదినారాయణ , అబ్బాస్ క్రియేట్ చేసిన మిషన్ పేరు "ధనుష్ " నే పెట్టుకున్నాడు. అతనే,  ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ లలో ఒకడు గా ఎదిగిన మన రఘువరన్ బీ టెక్.