Ravi Shastri on Rahul Tripathi: టాప్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి (Rahul Tripathi) టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచాడు. అతడు క్రీజులో ఉంటే పరుగుల వరద పారడం ఖాయమన్నాడు. ప్రత్యర్థి జట్టైనా, బౌలర్లైనా అతడిపై ఆధిపత్యం చెలాయించలేరని ధీమా వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో అతడు కచ్చితంగా ఆకట్టుకుంటాడని అంచనా వేశాడు.
'రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. బ్యాటు అంచులకు తగిలే బంతుల్ని అతడు ఆడడు. చక్కని షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. ఆటపై 360 డిగ్రీల్లో పట్టు ఉండటంతో ప్రత్యర్థి జట్టైనా, బౌలర్లైనా అతడిపై ఆధిపత్యం చెలాయించలేరు. త్రిపాఠి మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తాడు. మూడో స్థానంలో అతడు అద్భుతంగా ఆడతాడు. తర్వాతి బ్యాటర్లకు పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తాడు' అని రవిశాస్త్రి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో అన్నాడు.
Also Read: దటీజ్ విరాట్ కోహ్లీ! ఆగ్రహంతో ఇండియన్ ఫ్యాన్స్‌నీ తిట్టేశాడు!!
Also Read: విశాఖ వికెట్ కీపర్‌కు రిషభ్ పంత్ భయపడ్డాడా?
దేశవాళీ క్రికెట్లో రాహుల్ త్రిపాఠికి మంచి పేరుంది. అతడు అద్భుతమైన బ్యాటర్. ఐపీఎల్‌లో ప్రతిసారీ రాణిస్తాడు. ఈ మధ్యే ముగిసిన సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు ఆడాడు. మూడో స్థానంలో వచ్చి దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత చాకచక్యంగా బంతులేసినా విధ్వంసకరమైన ఇన్నింగ్సులు ఆడేశాడు. 158 స్ట్రైక్‌రేట్‌తో 413 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసులోనే అతడిని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. ఇతర కుర్రాళ్లను పరీక్షించడంతో చోటు దక్కలేదు. అయితే ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీసులో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. మరి ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.
ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికవ్వగానే రాహుల్ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది నాకో పెద్ద అవకాశం. నా కల నెరవేరింది. ఇందుకు నేనెంతో గర్వపడుతున్నాను. సెలక్టర్లతో సహా అందరూ నాపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. తుది జట్టులో చోటు దక్కితే కచ్చితంగా అత్యుత్తమంగా ఆడతాను' అని అతడు పేర్కొన్నాడు.