KS Bharat vs Rishabh Pant: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు టీమ్‌ఇండియా మెరుగ్గా సిద్ధమవుతోంది. ఆటగాళ్లంతా పట్టుదలగా క్రీజులో నిలుస్తున్నారు. భారత ప్రధాన కీపర్‌ రిషభ్ పంత్‌ (Rishabh Pant), రెండో కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ (KS Bharat) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. ఆఖరి టెస్టులో చోటు కోసం వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోటీపడి మరీ ఆడుతున్నారు. గురువారం కేఎస్‌ భరత్‌ (70*; 111 బంతుల్లో 8x4, 1x6) అజేయ అర్ధశతకం బాదేస్తే శుక్రవారం పంత్‌ (76; 87 బంతుల్లో 14x4, 1x6) అదరగొట్టాడు.


ప్రత్యర్థి జట్టులో పంత్‌


టీమ్‌ఇండియాకు మంచి ప్రాక్టీస్‌ దక్కేందుకు ఈసారి వినూత్న ప్రయోగం చేశారు. భారత బృందంలోని ఛెతేశ్వర్‌ పుజారా (0), రిషభ్ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రత్యర్థి జట్టైనా లీసెస్టర్‌ షైర్‌కు ఆడుతున్నారు. ఈ మ్యాచులో తొలిరోజు భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. 246/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది. 81/5తో ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ దుమ్మురేపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా పోరాడాడు. కఠిన పరిస్థితుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు మంచి ఫామ్‌లో ఉండటంతో రిషభ్ పంత్‌పై అందరి చూపు పడింది.


కేఎస్‌ నుంచి గట్టి పోటీ


రెండో రోజు త్వరగా వికెట్లు పడటంతో లీసెస్టర్‌ షైర్‌ పరిస్థితీ టీమ్‌ఇండియానే తలపించింది. 71కే 4 వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో రిషభ్ పంత్‌ రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడాడు. తనదైన రీతిలో భారీ షాట్లు ఆడాడు. 87 బంతుల్లోనే 14 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 76 పరుగులు దంచికొట్టాడు. ధాటిగా ఆడుతున్న అతడిని 45.3వ బంతికి రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. దాంతో 213/7తో లీసెస్టర్‌ షైర్‌ రెండోరోజు టీబ్రేక్‌కు వెళ్లింది.


దిల్లీ క్యాపిటల్స్‌లో సహచరులు


మొత్తంగా ఈ మ్యాచులో ఇద్దరు వికెట్‌ కీపర్లూ 70+ రన్స్‌ కొట్టారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. కాగా ఐపీఎల్‌లో పంత్‌ మంచి ఫామ్‌లో కనిపించలేదు. ఈ మ్యాచులో భరత్‌ను చూసి అతడు కసితో ఆడినట్టు కనిపించాడు. విచిత్రంగా ఈ ఆంధ్రా కుర్రాడికి దిల్లీ క్యాపిటల్స్‌లో పంత్‌ ఎక్కువ ఛాన్సులు ఇవ్వకపోవడం గమనార్హం.