Govt Teachers Properties : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తి వివరాలు విద్యాశాఖకు అందించాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని విద్యాశాఖ చెప్పినట్లు సమాచారం. టీచర్లు వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. నల్గొండ జిల్లాలో ఓ టీచర్ వ్యవహారంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


విజిలెన్స్ రిపోర్టుతో 


తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. టీచర్లకు, ఉద్యోగులుకు ఈ మేరకు విద్యాశాఖ అధికారులు శనివారం ఆదేశాలు జారీచేశారు. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే స్థిర, చర ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది. నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడిపై విజిలెన్స్ శాఖ రిపోర్టు ఇవ్వడంతో విద్యాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 


నల్గొండ ఘటనతో 


నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీపై వచ్చిన ఆరోపణల కారణంగా విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, స్థిరాస్తి వ్యాపారం చేశారని జావీద్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 


సర్క్యూలర్ లో ఏముంది?


ఏపీసీఎస్(1964) సర్వీస్‌ రూల్స్‌ 9లోని సబ్‌రూల్‌ను సర్క్యూలర్‌ లో గుర్తుచేశారు. ఉపాధ్యాయులు ఏటా ఆదాయం లెక్కలు చూపించాలని తెలిపారు. స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇండిపెండెంట్‌ ఇల్లు, ఫ్లాట్‌, షాప్‌, నివాసస్థలం, వ్యవసాయభూమి కొన్నా అమ్మినా అనుమతి తీసుకోవాలని సర్క్యూలర్ లో ఉంది. తన పేరుమీద లేక కుటుంబ సభ్యుల పేరు మీద కొన్నా వివరాలు తెలపాలని విద్యాశాఖ ఆదేశించింది. కొనడానికి ఆదాయం ఎలా వచ్చిందో లెక్కలు చూపాలని కోరింది. కారు, మోటార్‌సైకిల్‌, ఇతర వాహనం ఏది కొన్నా వివరాలు విద్యాశాఖకు అందించాలి. ఏసీ, టీవీ, వీసీఆర్‌, ఫ్రిజ్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ గూడ్స్ ఏం తీసుకున్నా వివరాలు తెలిపారు. బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు, బ్యాంక్‌ డిపాజిట్స్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు, ఇతర పెట్టుబడుల పూర్తి వివరాలు ఆస్తుల ప్రకటనలో తెలిపాలని విద్యాశాఖ తెలిపింది. 


గతంలోనూ సర్క్యులర్ 


పాఠశాల విద్యాశాఖ తెచ్చిన ఈ సర్క్యులర్‌లో పలు అంశాలు పాతవే అయినా, తాజాగా జారీ చేయడం మాత్రం సంచలనం అవుతోంది. మూడేళ్ల క్రితం ఇలాంటి సర్క్యులర్‌నే ఇచ్చిందని, అంతకుముందు కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయని టీచర్లు అంటున్నారు. సర్క్యులర్ ఇవ్వడం తప్ప వివరాలు సేకరించడంలేదని యూటీఎఫ్ నేతలు అంటున్నారు.