దోమ కాటు ఎంత ప్రమాదకరమో తెలిసిందే. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో దోమల బెడద క్రమేనా పెరిగే ప్రమాదం ఉంది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వేగంగా ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో అంతా దోమలను తరిమేందుకు కాయిల్స్, మస్కిటో లిక్వెడ్లను ఉపయోగిస్తారు. వీటి వల్ల దోమలు పోతాయో లేదోగానీ.. కొత్త వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ జపాన్ సంస్థ హైపర్ రియలిస్టిక్ డ్రాగన్‌ఫ్లై పెండెంట్‌లను విక్రయిస్తోంది. ఇది ఎలాంటి రసాయనాలు లేకుండానే దోమలను తరిమితేస్తుందట.
డ్రాగన్‌ఫ్లైస్ గురించి మనలో చాలామందికి తెలియవు. డ్రాగన్‌ఫ్లైస్ మాంసాహారులు. ఇదంటే కీటకాలకు వణుకిపోతాయి. అది వస్తుందటే చాలు.. అవి ఎక్కడికక్కడ పారిపోతాయి. ‘డ్రాగన్‌ఫ్లై’ పెండెంట్ విజయవంతంగా పనిచేయడానికి కూడా కారణం ఇదేనని ఆ సంస్థ చెబుతుంది. ఎంతో రియలిస్టిక్‌గా కనిపించే డ్రాగన్‌ఫ్లైను చూసి దోమలు పరుగులు పెడతాయని అంటున్నారు.
సాధారణంగా పెండెంట్‌లను మెడలో వేసుకొనే అలంకరణ వస్తువుగా విక్రయిస్తారు. అయితే, ఆ సంస్థ మాత్రం దాన్ని దోమలను, కీటకాలను తరిమే బగ్ రిపెల్లెంట్‌గా అమ్ముతున్నారు. ఈ పెండెంట్ కలిగిన లాకెట్టును మీ మెడలో వేసుకున్నా లేదా, క్యాప్‌కు పెట్టుకున్నా చాలని.. దాన్ని చూడగానే దోమలు పరారవుతాయని అంటున్నారు. వీటిలో ఎలాంటి హానికర రసాయనాలు లేవని చెబుతున్నారు.
జపనీస్ కంపెనీ Miki Locos Co.Ltd ఈ డ్రాగన్ పెండెంట్‌లను విక్రయిస్తోంది. వీటిని పిల్లలు, వృద్ధులు కూడా ధరించవచ్చని, ఇది ఉంటే.. వారు దోమ కాటుకు గురవ్వుతారనే భయం కూడా అక్కర్లేదని అంటున్నారు. నిజమైన డ్రాగాన్ ఫ్లైగా కనిపించే ఈ పెండెంట్‌ను పీవీసీ మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ఇది 100 మిల్లీ మీటర్ల పొడవు ఉంటుంది. దీని రెక్కలు 130 మిల్లీ మీటర్లు ఉంటాయి. అయితే, కేవలం తమ వస్తువును అమ్ముకోవడం కోసమే వాళ్లు ఈ ప్రచారం చేసి ఉంటారని తొలుత అంతా భావించారు. దీన్ని వాడుతున్నవారు సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందించారు. ఈ లాకెట్ ధరించిన తర్వాత దోమలు తమ వద్దకు రావడం లేదని అంటున్నారు. మరి, సోషల్ మీడియాలో స్పందిస్తున్న వ్యక్తులు నిజమైనవారో.. లేదా ఆ సంస్థ స్వయంగా అలా పాజిటివ్ రివ్యూలు రాయించుకుంటుందా అనేది సందేహమే. ఒక వేళ ఈ లాకెట్ ఇండియాలోకి వస్తే తప్పకుండా ప్రయత్నించి చూడండి. అది నిజంగా పనిచేస్తే దోమలు పోతాయ్. లేకపోతే మెడలో ఒక అందమైన లాకెట్‌గా మిగిలిపోతుంది.
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!