స్టూడెంట్ వీసాల ఆలస్యంపై భారత్ సంప్రదింపులు
ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, అమెరికా, యూకేకి వెళ్లాలనుకున్న విద్యార్థులకు వీసా ఇబ్బందులు తప్పటం లేదు. స్టూడెంట్ వీసాల జారీలో జాప్యంతో విద్యార్థులు విసిగిపోతున్నారు. ఇప్పటికే వేలాది అప్లికేషన్లు వస్తున్నా, వాటిని అప్రూవ్ చేసే ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగాసాగుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ కారణంగా విదేశాల్లో చాన్నాళ్ల పాటు విద్యా సంస్థల్ని మూసివేయాల్సి వచ్చింది. పైగా కొన్ని దేశాలు ఈ ఏడాది ఏప్రిల్ వరకూ కొవిడ్ బబుల్‌లో ఉండిపోయాయి. వీసాలు జారీ చేసే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇటీవలే యూకే కొవిడ్ బబుల్‌ని తీసేసి వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి అప్లికేషన్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. వీసాలు అందించే ప్రైవేట్ సంస్థలకూ భారీ మొత్తంలో అప్లికేషన్లు అందుతున్నాయి. స్టూడెంట్ వీసాలతో పాటు టూరిజం,ట్రావెలింగ్ వీసాలకూ డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా వీసాలు జారీ చేయలేకపోతున్నాయి పశ్చిమ దేశాలు. అందుకే వీసా అప్లై చేసిన వాళ్లు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
కొన్ని పశ్చిమ దేశాల్లో వీసాల వెయిటింగ్ పీరియడ్‌ని రెండు నెలలకు పెంచుతున్నారు. ఈ సమస్యపై భారత్ విద్యార్థులు పదేపదే ఫిర్యాదుచేస్తుండటం వల్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. వీసా జారీ ప్రక్రియ వేగంవంతమయ్యేలా చొరవ చూపాలంటూ ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాలకు భారీ మొత్తంలో స్టూడెంట్ వీసాల అప్లికేషన్లు వెళ్లాయి. అందుకే ఆయా దేశాల దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతున్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు. వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందం భాగ్చీ ట్వీట్ చేశారు. "ఆయా దేశాల దౌత్యవేత్తలు ,భారత్‌కు చెందిన విద్యార్థుల వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.