మిట్టమధ్యాహ్నం మాంచి గడ్డ పెరుగు వేసుకుని, అరటి పండు లేదా నిమ్మకాయ పచ్చడి నంజుకుని తింటే ఆ మజాయే వేరు కదా. కడుపు నిండుగా, చల్లగా.. ఉండటమే కాదు. కంటి రెప్పలు బరువెక్కి.. నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే, మనకు తెలియకుండా పట్టేసే ఆ నిద్రకు కారణం పెరుగేనని చాలామంది నిందిస్తారు. బాబోయ్, పెరుగు వేసుకుంటే నిద్ర వచ్చేస్తుందని చాలామంది.. దానికి దూరంగా ఉంటారు. ఆఫీసులో కొందరు పెరుగు అన్నం తినడానికి కూడా భయపడతారు. పెరుగు వల్ల పొరపాటు కళ్లు మూతపడితే బస్‌కు అడ్డంగా దొరికిపోతామనేది వారి భయం. అయితే, నిజంగా పెరుగు వల్లే మనకు నిద్ర పడుతుందా? లేదా కడుపు నిండా భోజనం చేయడం వల్ల అలా అనిపిస్తుందా??


పెరుగుతో అన్నం తిన్న తర్వాత నిద్రపట్టడం నిజమే. సాధారణంగా పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ను తయారు చేస్తుంది. దానివల్ల పెరుగు అన్నం తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. పాల ఉత్పత్తుల్లో కనిపించే కాల్షియం.. ట్రిప్టోఫాన్‌ను గ్రహించేలా మెదడును ప్రేరేపిస్తుందని పరిశోధకులు తెలిపారు. పెరుగు మాత్రమే కాదు ట్రిప్టోఫాన్ కలిగిన ఏ ఆహారాన్ని తిన్న ఇదే ప్రభావం పడుతుంది. ట్రిప్టోఫాన్‌లో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్ అనే అనే రెండు హార్మన్లు ప్రశాంతమైన నిద్రకు ప్రేరేపిస్తాయి. 


రాత్రివేళ పెరుగు తినొచ్చా? 


తెలుగు ప్రజలకు భోజనాన్ని పెరుగుతో ముగించడం అలవాటు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే. పెరుగు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అయితే, రాత్రివేళ పెరుగుతో ఆహారాన్ని తినేప్పుడు మాత్రం ఒకసారి ఆలోచించడం మంచిది. మన పెద్దలు కూడా రాత్రివేళ పెరుగు తినొద్దని చెబుతుంటారు. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రాత్రివేళ పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. ఒక వేళ మీరు జలుబుతో బాధపడుతున్నట్లయితే శ్లేష్మం తీవ్రత మరింత పెరుగుతుంది. కఫం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


మీకు ఆస్తమా లేదా ఉబ్బసం ఉన్నట్లయితే పెరుగుకు దూరంగా ఉండటమే ఉత్తమం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే రాత్రివేళ పెరుగు తినకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగును అస్సలు తినొద్దు. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తీనాలనిపిస్తే సలాడ్ రూపంలో కొద్దిగా తీసుకోవచ్చు. వాటిలో కాస్త మిరియాలు, ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ ముక్కలు వేసి తినాలి. 


Also Read: శృంగారం ఇంత సేపు చేస్తే మీరే కింగ్స్, భారతీయుల సరాసరి టైమ్ ఇదే!