ఉద్దవ్ థాక్రే రాజీనామా చేయరు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే మధ్య వైరం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అటు డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్...షిండే శిబిరంలోని 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నోటీసులు పంపారు. ఇటు ఏక్‌నాథ్ షిండే, ప్రభుత్వంపై తరచు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలకు శివసేన భద్రతను తొలగించిందని, కావాలనే కక్ష తీర్చుకుంటోందని విమర్శించారు. అలాంటిదేమీ లేదని, నిరాధార ఆరోపణలు చేయటం తగదని శివసేన వివరణ ఇచ్చింది. షిండే, ఉద్దవ్ థాక్రే ఈ పరిణామాల నేపథ్యంలోనే తప్పు మీదంటే మీదంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. శివసేన తరపున ఉద్దవ్ థాక్రేతో పాటు సీనియర్ నేత
సంజయ్ రౌత్ కూడా విరుచుకుపడుతున్నారు. చెప్పాలంటే థాక్రే కన్నా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. షిండే శిబిరంలోకి వెళ్లిన నేతలపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో స్పందించారు.
నిప్పంటుకుంటే అంత తొందరగా చల్లారదు..
ఉద్దవ్ థాక్రే ససేమిరా రాజీనామా చేయరని, ఈ కుట్రను ఇక్కడితో ఆపకపోతే శివసేన సైనికులను వీధుల్లోకి దింపాల్సి వస్తుందనిహెచ్చరించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. చివరి వరకూ శివసేన పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. "ఇది నా ఒక్కడి కోపమే కాదు. మొత్తం శివసేన ఎమ్మెల్యేల ఆగ్రహం. ఒక్కసారి నిప్పంటుకుంటే అది అంత తొందరగా చల్లారదు" అని అన్నారు సంజయ్. శివసేన కార్యకర్తలు ఇప్పటికే రెబల్ నేతల కార్యాలయాలపై దాడులు మొదలు పెట్టారు. పుణేలో రెబల్ నేత తనాజీ సావంత్ ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ముంబయికి వచ్చి నేరుగా తమతో తలపడాలంటూ సంజయ్ రౌత్ సవాలు విసిరారు.