కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో అల్లర్లు ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆవుల సుబ్బారావును అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. సాయి డిఫెన్స్ అకాడమీని రన్ చేస్తోన్న సుబ్బారవు... సికింద్రాబాద్‌ అల్లర్లలో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆయన్ని కొన్ని రోజల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి విచారించి ఇవాళ అరెస్టు చూపించారు. 


సుబ్బారావుతోపాటు అతని అనుచరులు ముగ్గుర్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లను ఇవాళ రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అందరికీ 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 


అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన రైల్వే ఎస్పీ అనురాధ... కుట్రకు సంబంధించిన ఆధారాలు తారుమారు చేసేందుకు సుబ్బారావు గ్యాంగ్ ట్రై చేసిందన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తలెత్తిన అల్లర్లకు సుబ్బారావే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారామె. అతనితోపాటు ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఈ నలుగురిపై రైల్వే యాక్ట్‌తోపాటు మరో 25 సెక్షన్లపై కేసులు రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. 



వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి ప్లాన్ చేశారని... హైదరాబాద్‌లోనే ఉంటే తన అనుచరులకు సూచనలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. విచారణకు దొరక్కుండా వాట్సాప్‌లో మెసేజ్‌లు, వీడియోలు డిలీట్ చేయించారని కనిపెట్టారు.