Hyderabad News : హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యాలయంపై ఎన్.ఎస్.యు.ఐ నాయకులు దాడికి యత్నించారు. దాడి చేయడానికి ప్రయత్నించిన ఎన్.ఎస్.యు.ఐ నేతలను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిక్కడపల్లి పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేరళలోని వాయనాడ్ లో రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగినట్లు ఎన్.ఎస్.యు.ఐ నేతలు ప్రకటించారు.
రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి
కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ కార్యాయంపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు శుక్రవారం దాడిచేశారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చిన కార్యకర్తలు ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలను పగులకొట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు పట్టుకున్న కొందరు యువకులు వాయనాడ్ లోని రాహుల్ గాంధీ కార్యాలయం గోడ ఎక్కి కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్యాలయంలో పెద్ద ఎత్తున వచ్చిన దుండగులు ఆఫీసులోని సిబ్బందిపై కూడా దాడి చేశారు. రాహుల్ గాంధీ కార్యాలయంలో విధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోల్డ్ స్కామ్ పై నిరసనలే కారణమా?
పోలీసుల సమక్షంలోనే ఆ దాడి జరిగిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. సీపీఎం నాయకత్వం చేస్తున్న కుట్ర అని విమర్శించారు. ఈ దాడి వెనుక కేరళ సీఎం పినరయి విజయన్ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. గోల్డ్‌స్కామ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను సీఎం విజయన్ జీర్ణించుకోలేక దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడిని కేరళ సీఎం విజయన్ ఖండించారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.