భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తాయి. ముఖ్యంగా నదీ తీరంలో నివసించే ప్రజలు వరదల సమయంలో ఇంట్లో ఉండాలంటేనే వణికిపోతారు. వరదల వల్ల ఒక్కోసారి ఇళ్లు కూడా పూర్తిగా మునిగిపోతుంటాయి. దీంతో చాలామంది ఇళ్ల పైకప్పులపైకి చేరి సాయం కోసం ఎదురుచూస్తుంటారు. వరదలు తగ్గిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వెంటాడతాయి. ఇంట్లోకి వచ్చే నీరు వల్ల భారీగా బురద పేరుకుపోతుంది. వాటిలో పాములు కూడా ఉంటాయి. అయితే, జపాన్ ఇంజినీర్లు రూపొందించిన ఈ ఇళ్లు.. భారీ వరదలను సైతం తట్టుకుంటాయి. చుక్క నీరు కూడా ఇంట్లోకి వెళ్లదు. అలాగే ఆ ఇళ్లు వరదలో కొట్టుకుపోవు కూడా.
- ప్రకృతి వైపరిత్యాలకు పెట్టింది పేరు జపాన్. భుకంపాల నుంచి సునామీల వరకు ప్రతి విపత్తు గురించి అక్కడి ప్రజలకు అవగాహన ఉంది. అందుకే, వారు చెక్కలతో తేలికపాటి ఇళ్లను నిర్మిస్తారు. జపాన్‌లో ఉన్న భారీ భవనాలు సైతం విపత్తులను తట్టుకోగలిగేవే. భూకంపాల సమయంలో భయంకరంగా అటూఇటూ.. ఊగుతాయే గానీ, కూలిపోవు. అయితే, భారీ వరదల సమయంలో ప్రజలు నివసించే మునిగిపోవడమే కాకుండా, నీటితోపాటు కొట్టుకెళ్లిపోతాయి. నీరు కూడా చాలా వేగంగా ఇళ్లల్లోకి చేరిపోతుంది.
- ఈ నేపథ్యంలో జపనీస్ హౌసింగ్ డెవలపర్ ఇచిజో కొముటెన్ ఇటీవల ‘వరద-నిరోధక ఇల్లు’(flood-resistant house)ని ఆవిష్కరించారు. ఇది వరదల సమయంలో నీరు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, నీటితోపాటూ పైకి తేలుతుంది కూడా. అదేంటీ, అలా తెలితే ఈజీగా కొట్టుకుపోతుంది కదా అనేగా మీ సందేహం. అలా ఇల్లు వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు బలమైన నాలుగు ఇనుపు కడ్డీలను భూమిలోకి పాతారు. వాటికి బలమైన ఇనుప తాళ్లను ఇల్లు నాలుగు కొనలకు కట్టారు. దీనివల్ల వరద నీరు వచ్చినప్పుడు ఇల్లు కూడా పైకి తేలుతుంది. దానివల్ల ఇల్లు పూర్తిగా మునిగిపోదు. పైగా ఆ ఇంటి తలుపులు, నిర్మాణమంతా వాటర్ ప్రూఫ్. చిన్న రంథ్రం నుంచి కూడా నీరు బయటకు వెళ్లదు. భారీ దుంగలు వచ్చి గుద్దినా సరే వాటి అద్దాలు పగలవు.
- ఇటీవల ఓ ప్రముఖ జపనీస్ టీవీ షోలో ఈ ‘ఫ్లడ్ రెసిస్టెంట్ హౌస్’ పనితీరును ప్రదర్శించారు. అప్పటినుంచి స్థానిక ప్రజలు అలాంటి ఇళ్లు తమకూ కావాలంటూ ఆ సంస్థను సంప్రదిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా రెండు వేర్వేరు భారీ నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక దాన్లో సాధారణ ఇంటిని, మరొకదాన్లో ‘ఫ్లడ్ రెసిస్టెంట్’ హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ వాటర్ ట్యాంకుల్లోకి ఫోర్సుగా నీటిని వదలడం ప్రారంభించారు. సాధారణ ఇంట్లోకి నీరు ప్రవేశించి.. గదులన్నీ మునిగిపోగా, ఫ్లడ్ రెసిస్టెంట్ హౌస్‌లోకి మాత్రం ఒక చుక్క నీరు కూడా వెళ్లలేదు. పైగా ఆ ఇల్లు నీటి మట్టంతోపాటే కొన్ని అడుగుల ఎత్తుకు లేచింది. ఆ ఇల్లు కొట్టుకుపోకుండా ఆ ఇంటికి అమర్చిన కేబుళ్లు గట్టిగా పట్టుకున్నాయి.
- ఇచిజో కొముటెన్‌లోని ఇంజనీర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వరద-నిరోధక ఇల్లు భూమి నుంచి ఐదు మీటర్ల వరకు తేలుతుంది. కాబట్టి, నీరు కిటికీలకు చేరుకునే అవకాశం లేదు. ఇల్లు కాస్త పైకి తేలడం వల్ల నీరు ఫోర్సుగా ఇంటిని తొయ్యదు. ఇంటి కింద నుంచి నీరు ప్రవహిస్తూ వెళ్లిపోతుంది. ఈ ఇంటి నిర్మాణానికి రూ.4,46,039 మాత్రమే ఖర్చవుతుంది. ఇంటి సైజు, సదుపాయాలు పెరిగే కొద్ది ధర కూడా పెరుగుతుంది. అయితే, మిగతా ఇళ్లతో పోల్చితే చాలా తక్కువ ధరకే ఈ ఇల్లు లభిస్తుండటంతో ప్రజలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
వీడియో:
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!