ఐపీఎల్‌లో నేడు జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీపై కోల్‌కతా మూ వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడిలో చిత్తయింది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.,, అశ్విన్ మొదటి నాలుగు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ సమయం రాహుల్ త్రిపాఠి సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ కోల్‌కతా వశం అయింది. అక్టోబర్ 15వ తేదీన జరగనున్న ఫైనల్స్‌లో కోల్‌కతా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.


పూర్తిగా విఫలమైన ఢిల్లీ బ్యాటింగ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు పిచ్ కూడా కఠినంగా ఉండటంతో.. పరుగులు చేయడం చాలా కష్టం అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో మంచి షాట్లు కొట్టి టచ్ మీద కనిపించిన పృథ్వీ షా (18: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఐదో ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (36: 39 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), మార్కస్ స్టాయినిస్ (18: 23 బంతుల్లో, ఒక ఫోర్) నిదానంగా ఆడటంతో పరుగులు రాలేదు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.


ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్లో స్టాయినిస్ అవుటయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ (30 నాటౌట్: 27 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో శిఖర్ ధావన్ కూడా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (6: 6 బంతుల్లో, ఒక ఫోర్) మొదటి నుంచే వేగంగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే కనెక్ట్ అవ్వకపోవడంతో తను కూడా త్వరగానే అవుటయ్యాడు. హెట్‌మేయర్ (17: 10 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టడంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా, లోకి ఫెర్గూసన్, శివం మావి చెరో వికెట్ తీశారు.


Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఓపెనర్లే కొట్టేశారు
మరోవైపు కోల్‌కతాకు మాత్రం అదిరిపోయే ప్రారంభం లభించింది. మంచి ఫాంలో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ (55: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) జాగ్రత్తగా ఆడుతూనే.. చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. దీంతో స్కోరు వేగం తగ్గలేదు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఢిల్లీకి అసలేమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 10 ఓవర్లలో 76 పరుగులకు చేరుకుంది. అప్పటికి విజయానికి 60 బంతుల్లో 60 పరుగులు చేస్తే సరిపోతుంది.


38 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం ఇన్నింగ్స్ 13వ ఓవర్లలో వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. గిల్, వెంకటేష్ అయ్యర్ మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత మ్యాచ్ నాటకీయ మలుపులు తిరిగింది. 25 బంతుల్లో కోల్‌కతా విజయానికి 13 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కోల్‌కతా విజయం సులభం అనే అనుకున్నారు అందరూ. అయితే ఢిల్లీ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు.


ఇన్నింగ్స్ 16, 17, 18, 19 ఓవర్లలో ఒక్కో వికెట్ పడగా.. అశ్విన్ వేసిన చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు తీసుకున్నాడు. రెండు బంతుల్లో ఆరు కొట్టాల్సిన సమయంలో రాహుల్ త్రిపాఠి సిక్సర్ కొట్టి కోల్‌కతాను ఫైనల్స్‌కు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, అశ్విన్, రబడ రెండేసి వికెట్లు తీయగా, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.


Also Read: ధోనీ ది గ్రేట్‌! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు


Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్‌ రేటింగ్‌.. స్టార్‌ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి