IPL 2022, MI vs RR Jos Buttler Becomes First Batsman to Score Century In IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డు నమోదు చేశారు. ఈ సీజన్‌లో తొలి శతకం బాదిన ఆటగాడిగా జాస్ బట్లర్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. బట్లర్ రాణించడంతో ముంబైపై 23 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. బట్లర్ (100: 68 బంతుల్లో, 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఛేజింగ్‌లో ముంబై తడబాటుకు లోనై ఓటమిపాలైంది.


వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో శతకం బాదిన రెండో ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. గత ఏడాది 2021 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 64 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం అందుకు వేదికగా మారింది. గతంలో బెన్ స్టోక్స్ రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో సెంచరీలు చేశాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో తాను ఆడుతున్న రెండో మ్యాచ్‌లో బట్లర్ 66 బంతుల్లో అద్భుత శతకంతో జట్టును ఆదుకోవడంతో పాటు రాజస్థాన్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై జట్టుపై 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో బట్లర్ శతకాన్ని నమోదుచేశాడు.


థంపి ఓవర్లో విధ్వంసం..
ముంబై బౌలర్ బాసిల్ థంపి వేసిన నాలుగో ఓవర్‌లో బట్లర్ వీరవిహారం చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు బట్లర్. దీంతో కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరిన బట్లర్.. మురుగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది రాజస్థాన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు బట్లర్. 






రాజస్థాన్‌ను ఆదుకున్న బట్లర్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ ప్రారంభం అయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1: 2 బంతుల్లో), ఆరో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ (7: 7 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 48 పరుగులు కాగా... అందులో జోస్ బట్లర్‌వే 40 పరుగులు కావడం విశేషం. కెప్టెన్ సంజు శామ్సన్‌తో (30: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) కలిసి 82 పరుగులు జోడించాడు. బట్లర్ శతకంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా, ముంబైకి వరుసగా రెండో మ్యాచ్ ఓటమి.


IPLలో 2 లేదా అంతకంటే ఎక్కువ శతకాలు చేసిన విదేశీ ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్
ఆడం గిల్ క్రిస్ట్
డేవిడ్ వార్నర్
షేన్ వాట్సన్
ఏబీ డివిలియర్స్
బ్రెండన్ మెకల్లమ్
బెన్ స్టోక్స్
హషీం ఆమ్లా
జాస్ బట్లర్


Also Read: RR Vs MI: ముంబైపై రాయల్ విక్టరీ - అదరగొట్టిన హైదరాబాదీ తిలక్ - అడ్డుకున్న రాజస్తాన్ బౌలర్లు! 


Also Read: GT Vs DC: గుజరాత్ బౌలర్లా మజాకా - ఢిల్లీకే కళ్లెం వేశారుగా - 14 పరుగులతో హార్దిక్ సేన విక్టరీ!