RR Vs MI Match Result: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీలో ఇది రాజస్తాన్‌కు వరుసగా రెండో విజయం కాగా... ముంబైకి వరుసగా రెండో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (100: 68 బంతుల్లో, 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులకు పరిమితం అయింది. ఈ సీజన్‌లో టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
శతక్కొట్టిన బట్లర్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ ప్రారంభం అయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1: 2 బంతుల్లో), ఆరో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ (7: 7 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 48 పరుగులు కాగా... అందులో జోస్ బట్లర్‌వే 40 పరుగులు కావడం విశేషం. దీన్ని బట్టే జోస్ బట్లర్ రాజస్తాన్‌ను ఎంతగా ఆదుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
అనంతరం మూడో వికెట్‌కు కెప్టెన్ సంజు శామ్సన్‌తో (30: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) కలిసి 82 పరుగులు జోడించాడు. ఈ దశలోనే బట్లర్ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సంజు శామ్సన్‌ను అవుట్ చేసి పొలార్డ్ ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. అయితే షిమ్రన్ హెట్‌మేయర్ (35: 14 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాకతో ముంబై కష్టాలు రెట్టింపయ్యాయి. మొదటి బంతి నుంచే పూర్తిగా అటాకింగ్ మోడ్‌లో ఆడిన హెట్‌మేయర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్, హెట్‌మేయర్‌కు నాలుగో వికెట్‌కు కేవలం నాలుగు ఓవర్లలోనే 53 పరుగులు జోడించడం విశేషం.
అయితే చివరి రెండు ఓవర్లలో రాజస్తాన్ ఇన్నింగ్స్ పూర్తిగా గాడి తప్పింది. ఈ 12 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే స్కోర్ చేసి ఐదు వికెట్లను రాజస్తాన్ కోల్పోయింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడు వికెట్లు పడ్డాయి. అదే ఓవర్లో శతకం పూర్తి చేసుకున్న బట్లర్ వెంటనే అవుటయ్యాడు. బట్లర్, హెట్‌మేయర్‌ల వికెట్లను బుమ్రా దక్కించుకోగా... అశ్విన్ (1) రనౌటయ్యాడు. ఇక చివరి ఓవర్లో రియాన్ పరాగ్(5), నవదీప్ సైనీల (2) వికెట్లను టైమల్ మిల్స్ దక్కించుకున్నాడు. దీంతో ఒక దశలో 210-220 పరుగులు చేస్తుందనుకున్న రాజస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులకే పరిమితం అయింది. జోస్ బట్లర్, సంజు శామ్సన్, షిమ్రన్ హెట్‌మేయర్ తప్ప ఇంకెవరూ కనీసం ఎనిమిది పరుగులు కూడా చేయలేకపోయారు. ముంబై బౌలరల్లో బుమ్రా, టైమల్ మిల్స్ మూడేసి వికెట్లు తీశారు. పొలార్డ్‌కు ఒక వికెట్ దక్కింది.
అదరగొట్టిన హైదరాబాదీ... కానీ!
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా మంచి ఆరంభం లభించలేదు. ఫాంలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ(10: 5 బంతుల్లో, ఒక సిక్సర్), వన్‌డౌన్ బ్యాటర్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) నాలుగు ఓవర్లకే పెవిలియన్ చేరుకున్నారు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు ఓవర్లకు 40 పరుగులుగా ఉంది.
ఈ దశలో ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు (54: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (61: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జత కలిశాడు. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ముఖ్యంగా తిలక్ వర్మ సిక్సర్లతో చెలరేగాడు. ఐపీఎల్ కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ ఏకంగా ఐదు సిక్సర్లు కొట్టడం విశేషం. ఇషాన్, తిలక్ మూడో వికెట్‌కు తొమ్మిది ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేవలం రెండు ఓవర్ల వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలబడలేకపోవడం, కీరన్ పొలార్డ్ (22: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) చివరి వరకు ఉన్నా భారీ షాట్లు కొట్టనివ్వకుండా రాజస్తాన్ బౌలర్లు అడ్డుకోవడంతో ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో చాహల్, నవదీప్ సైనీ రెండేసి వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్, ప్రసీద్ కృష్ణ, ట్రెంట్ బౌల్డ్ తలో వికెట్ తీశారు.