ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (84: 46 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.


గుజరాత్‌పై గిల్ ప్రతాపం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (1: 2 బంతుల్లో) ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వేడ్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో విజయ్ శంకర్‌తో (13: 20 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84: 46 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన విజయ్ శంకర్‌ను ఏడో ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది.


అనంతరం శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఈ లోపే శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో హార్దిక్ అవుటయినా... గిల్ మాత్రం జోరు తగ్గించలేదు. సెంచరీ చేస్తాడనుకున్నప్పటికీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది.


ఆ తర్వాత మిల్లర్ (20 నాటౌట్: 15 బంతుల్లో, రెండు ఫోర్లు), రాహుల్ టెవాటియా (14: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి స్కోరును ముందుకు నడిపించారు. అయితే చివర్లో స్కోరు నిదానించడంతో గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీసుకోగా... ఖలీల్ అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.


ఆఖర్లో కుప్పకూలారు
ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను (3: 5 బంతుల్లో) హార్దిక్ పాండ్యా, ఐదో ఓవర్లో పృథ్వీ షా (10: 7 బంతుల్లో, ఒక ఫోర్), మన్‌దీప్ సింగ్‌లను (18: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు) లోకి ఫెర్గూసన్ అవుట్ చేశారు. దీంతో ఢిల్లీ ఐదు ఓవర్లలో కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


అయితే ఈ దశలో రిషబ్ పంత్ (43: 29 బంతుల్లో, ఏడు ఫోర్లు), లలిత్ యాదవ్ (25: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఐదో వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. అనంతరం ఢిల్లీ ఇన్నింగ్స్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో లలిత్ యాదవ్ రనౌట్ కాగా... 15వ ఓవర్లో రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌లను (8: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) లోకి ఫెర్గూసన్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శార్దూల్ ఠాకూర్ (2: 5 బంతుల్లో)... రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక రొవ్‌మన్ పావెల్ (20: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఖలీల్ అహ్మద్‌లను (0: 1 బంతి) షమీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత చివర్లో కుల్దీప్ యాదవ్ (14 నాటౌట్: 14 బంతుల్లో ఒక సిక్సర్), ముస్తాఫిజుర్ (3: 5 బంతుల్లో) జట్టును ఆలౌట్ అవ్వకుండా ఆపగలిగారు.