ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌కు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది! ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారని తెలిసింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వేలం నిర్వహిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. బహుశా బోర్డు నిర్వహించే చివరి భారీ వేలం ఇదే కావొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీలు పూర్తి స్థాయి వేలాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
'కొవిడ్ పరిస్థితులు మరీ దిగజారకపోతే మాత్రం ఐపీఎల్ మెగావేలం భారత్‌లోనే ఉంటుంది. రెండు రోజులు వేలాన్ని ఫిబ్రవరి 7, 8న నిర్వహిస్తారు. బెంగళూరులో పెట్టాలని అనుకుంటున్నాం. సన్నాహకాలు కొనసాగుతున్నాయి' అని బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. యూఏఈలో వేలం నిర్వహిస్తారని మొదట వార్తలు వచ్చినా అందుకు బోర్డు సిద్ధంగా లేదని తెలిసింది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌తో కేసులు పెరిగి, ఆంక్షలు పెడితే మాత్రం విదేశాల్లోనే ఆక్షన్ ఉండొచ్చని అంచనా.
కొత్త సంవత్సరంలో ఐపీఎల్‌ను పది జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సంజీవ్ గోయెంకాకు చెందిన వ్యాపార సంస్థ లఖ్‌నవూ ఫ్రాంచైజీని దక్కించుకోగా వెంచర్ క్యాపిటల్ సంస్థ సీవీసీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అయితే సీవీసీకి ఇంకా బీసీసీఐ క్లియరెన్స్ ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ముగ్గురు ఆటగాళ్లను ముందే ఎంపిక చేసుకోవచ్చు. క్రిస్‌మస్ తర్వాత వారి పేర్లు వెల్లడించే అవకాశం ఉంది.
లఖ్‌నవూ ఫ్రాంచైజీ దూకుడుగానే కనిపిస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంది. గ్రాంట్‌ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. పాత జట్లు మెగా ఆక్షన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. తాము ఎంతో కష్టపడి రూపొందించుకున్న జట్లను త్యాగం చేయాల్సి వస్తోందని బాధపడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, కాగిసో రబాడా, అశ్విన్ వంటి క్రికెటర్లను వదిలేయడం ఎంతో బాధగా ఉందని దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్ జిందాల్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్..! ఆ భయంకర పేసర్ సిరీసు నుంచి ఔట్!
Also Read: South Africa vs India: కోచ్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్ కోహ్లీ
Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి కిదాంబి శ్రీకాంత్.. లక్ష్యకు కెరీర్ బెస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి