ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి మాటలు విన్నప్పుడు 'బస్సు కింద పడేసి తొక్కినట్టు' అనిపించిందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. విజయోత్సాహంలో ఏర్పాటు చేసిన పార్టీల్లో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోయానని పేర్కొన్నాడు. ఒకానొక దశలో ఆటకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యానని వెల్లడించాడు. తన మనసులోని మాటలను యాష్ చాన్నాళ్ల తర్వాత ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు చెప్పాడు.
టీమ్‌ఇండియా 2018లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పట్లో అశ్విన్‌ను ఎక్కువగా జట్టులోకి తీసుకోని సంగతి తెలిసిందే. 'ఇప్పటికే కుల్‌దీప్ విదేశాల్లో టెస్టు క్రికెట్ ఆడాడు. ఐదు వికెట్లు తీశాడు. అందుకే విదేశాల్లో అతడు మా ప్రధాన స్పిన్నర్ అయ్యాడు. ఇకపై మేం ఒక స్పిన్నర్‌తో ఆడాలనుకుంటే అతడినే ఎంచుకుంటాం. కొందరికి కొంత సమయమే (యాష్‌ను ఉద్దేశించి) కలిసొస్తుంది! కానీ మాకిప్పుడు కుల్‌దీప్ ప్రధాన స్పిన్నర్' అని రవిశాస్త్రి అప్పట్లో మీడియా సమావేశంలో అన్నాడు.
'నేను రవిభాయ్‌ను అత్యంత గౌరవిస్తాను. మళ్లీ మనకు టైమ్ వస్తుందని తెలిసినా బాధపడుతుంటాం! నేనూ అంతే. నలిపేసినట్టు అనిపించింది. మన సహచరుల విజయాలను ఆస్వాదించడం ఎంత ముఖ్యమో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. కుల్‌దీప్‌ను చూస్తే నేనెంతో సంతోషిస్తా. ఆసీస్‌లో నేనెప్పుడూ ఐదు వికెట్ల ఘనత సాధించలేదు. నేనెంతో బాగా బౌలింగ్ చేసినా అక్కడ ఈ ఘనత అందుకోలేదు. అందుకే అతడిని చూసి గర్విస్తుంటాను. ఇక ఆసీస్‌పై గెలవడం అంతకు మించిన ఆనందం' అని యాష్ అన్నాడు.
'కుల్‌దీప్ సంతోషంలో, జట్టు విజయాల్లో భాగం అయ్యుంటే నేను జట్టుకు చెందినవాడిగా అనిపించేది. కానీ బస్సు కింద పడేసినట్టు అనిపిస్తే నేనెలా పార్టీలకు హాజరవుతాను? సహచరుడి సంతోషాన్ని పంచుకుంటాను? నేను నా గదికి వెళ్లి నా భార్యతో మాట్లాడాను. నా పిల్లల్ని కౌగిలించుకున్నాను. అయినా నేను మళ్లీ పార్టీలకు వెళ్లాను. ఎందుకంటే ఆసీస్‌లో విజయం అత్యంత గొప్పది. తొలి టెస్టులో గాయపడ్డప్పటికీ నేను 50+ ఓవర్లు విసిరాను. కడుపులో గ్రేడ్ 3 గాయమైనా పోరాడాను. బాధను భరిస్తూ నేను అద్భుతంగా బౌలింగ్ చేసినా.. లైయన్ 6 తీస్తే యాష్ 3 వికెట్లే తీశాడని అన్నారు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.