ఎంతో కాలంగా పెళ్లి కోసం వేచి ఉన్న వ్యక్తి చివరికి వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ సంతోషం ఆయనకు ఎక్కువ కాలం నిలవలేదు. భార్య వ్యవహరించిన షాకింగ్ ఘటనతో అతని దిమ్మతిరిగింది. హైదరాబాద్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే భార్య ఉన్నదంతా దోచుకుపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యంత నాటకీయంగా ఈ పరిణామం జరిగింది. భర్త వద్దకు చ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదు, నగరలతో ఉడాయించింది. హైదరాబాద్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి యుక్త వయసులో ఉండగా.. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. వయసు పెరగడంతో సంబంధాలు రావడం ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో తెలిసిన వారి ద్వారా ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే మంచి సంబంధం చూస్తానని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని ఇచ్చాడు. దీంతో మధ్యవర్తి ఓ సంబంధం తెచ్చాడు. 


అనాథ అయిన ఓ అమ్మాయి ఉందని తనతో పాటు విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు తన స్నేహితుడు, మధ్యవర్తితో కలిసి విజయవాడకు వెళ్లాడు. అక్కడ పెళ్లి చూపులు జరిగిన వెంటనే అమ్మాయి, అబ్బాయి ఓ హోటల్‌లో వారం రోజుల క్రితం గురువారం పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగాక, భార్యను యాదాద్రికి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు. 


అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చి షాపింగ్ చేశారు. తాళి కోసం 3 తులాల గోల్డ్ చైన్, రూ.40 వేల బట్టలు కొనుక్కొని శుక్రవారం రాత్రి 8.30కి సొంతూరు చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే కొత్త పెళ్లి కూతురు బీరువాలో బట్టలు సర్దుతున్నట్లు నటించింది. వెంటనే అందులోని రూ.2 లక్షలు, కొత్త బట్టలను తన బ్యాగులోకి మార్చుకుంది. మరోవైపు, ఆమెతో పాటు వచ్చిన మరో యువతి స్థానికంగా కారును అద్దెకు తీసుకొని మాట్లాడి ఉంచింది. 


తనకు తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్లు తెమ్మని భర్తని కోరగా.. అతను మెడికల్ షాపునకు వెళ్లాడు. అతను వెళ్లగానే ఇద్దరూ సర్దుకున్న సొత్తులతో కారులో ఉడాయించారు. ఇంజాపూర్‌ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసిన కారు డ్రైవర్‌ అవాక్కయ్యాడు. కారులోనే వారు బట్టలు మార్చుకోవడం చూసి ప్రశ్నించాడు. అతణ్ని బెదిరించారు. ఎల్బీ నగర్‌ వద్ద కారుదిగి విజయవాడకు బస్సులో ఉడాయించారు. మరోవైపు, బాధిత పెళ్లి కొడుకు సోమవారం స్థానిక పెద్దలకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. మరోవైపు, మధ్యవర్తిని అందరూ కలిసి నిలదీశారు. దీంతో ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం.


Also Read: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...


Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !


Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి