బ్యాడ్మింటన్ యువ కెరటం కిదాంబి శ్రీకాంత్ మరోసారి అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ తిరిగి పదో ర్యాంకులో నిలిచాడు.
మరో షట్లర్ లక్ష్యసేన్ ఏకంగా కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 17వ స్థానం కైవసం చేసుకున్నాడు. మరోవైపు 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ 19వ ర్యాంకుకు పడిపోయాడు. ఇక హెచ్‌ఎస్ ప్రణీత్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంకుకు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో స్థానంలో కొనసాగుతోంది.
కిదాంబి శ్రీకాంత్ రెండేళ్ల క్రితం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చైనాకు చెందిన లిన్‌డాన్ సహా దిగ్గజాలను ఓడించి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయాల పాలవ్వడం, టోర్నీల నుంచి తప్పుకోవడంతో ర్యాంకు పడిపోయింది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ చేరుకొని రజత పతకం అందుకున్నాడు. 20 ఏళ్ల యువకుడు లక్ష్యసేన్ సెమీస్‌లో అతడి చేతిలోనే ఓటమి పాలై కాంస్య పతకం గెలిచాడు.
భారత్‌కు తిరిగొచ్చిన కిదాంబి శ్రీకాంత్ తన ఆటను మరింత మెరుగ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. 'నేనిదే జోరు కొనసాగించాలి. మరింత మెరుగవ్వాలి. ఎందుకంటే ఆల్ ఇంగ్లాండ్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఉన్నాయి. అందుకే రాబోయే 8-10 నెలలకు అత్యంత కీలకం. నేను నిరంతరం గోపీ అన్నతో మాట్లాడుతూనే ఉంటాను. కొన్ని నెలలుగా నా ఆటలోని లోపాల గురించి చర్చిస్తాను. నేను బీడబ్ల్యూఎఫ్ ఫైనల్ చేరినప్పటికీ కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. మెరుగైన ఆటగాడిగా మారాలంటే వాటిని సరిదిద్దుకోవాలి' అని శ్రీకాంత్ అన్నాడు.
Also Read: Watch Video: పడక గదిలో భార్య పక్కనుంటే.. అర్ధరాత్రి స్టీవ్ స్మిత్ ఏం చేస్తున్నాడో చూడండి!
Also Read: IND vs SA, 1st Test: భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గ్యాలరీలు ఖాళీ.. ఒమిక్రాన్ భయంతోనే!
Also Read: Rafael Nadal Covid Positive: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కు కరోనా... ట్వీట్ చేసిన రఫా...