South Africa T20 League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్! ఈ టోర్నీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టయ్యిందంటే ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీల యాజమాన్యాలూ ఓ కారణమే! ఇతర దేశాల క్రికెట్ లీగుల్లోనూ వీరు తమదైన ముద్ర వేయాలని తపన పడుతున్నారు. దక్షిణాఫ్రికాలో త్వరలో నిర్వహించే టీ20 లీగులో ఆరుకు ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే దక్కించుకోవడం ఇందుకు తాజా నిదర్శనం!
దక్షిణాఫ్రికాలో అతిత్వరలో నిర్వహించే దేశవాళీ టీ20 లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలను ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ యజమానులు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ లీగ్ మొదలవుతుందని తెలిసింది.
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జట్టును ఎంత బాగా నడిపిస్తుందో అందరికీ తెలిసిందే. వీరు న్యూలాండ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఇక జొహన్నెస్‌బర్గ్ ఫ్రాంచైజీని చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకుంది. దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ప్రిటోరియా ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ యజమానులు డర్బన్ జట్టును దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్లైన సన్ నెట్‌వర్క్ కెబ్రెహా, రాజస్థాన్ రాయల్స్ పార్ల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.
టీ20 లీగ్ ఫ్రాంచైజీలను భారతీయులు కొనుగోలు చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం సంతోషం వ్యక్తం చేసింది. 'దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంతో సంతోషించే క్షణాలివి. లీగ్‌కు ఇంత ఆదరణ లభించిందంటే అంతర్జాతీయ క్రికెటింగ్ ఎకో సిస్టమ్‌లో మనదేశం విలువేంటో అర్థం చేసుకోవచ్చు' అని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అన్నాడు.
'బలమైన క్రీడా నేపథ్యం గల యజమానులు, అంతర్జాతీయ బ్రాండ్ల వల్ల దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మేలు జరుగుతుంది. వారి అనుభవం, వనరులతో క్రికెట్ ఇండస్ట్రీ ప్రయోజనం పొందుతుంది. ఈ లీగుకు వారు స్థిరత్వం, అనుభవాన్ని తీసుకురాగలరు. మేం ఇప్పటికే అంతర్జాతీయ క్రికెటర్లను సంప్రదించాం. త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తాం' అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు ఇతర దేశాల లీగుల్లో జట్లను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు. కరీబియన్ లీగులో కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్‌కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో కేకేఆర్ భాగస్వామిగా ఉంది.
Also Read: అదే జరిగితే కోహ్లీ 'అన్‌స్టాపబుల్'!