Syed Kirmani On Virat Kohli: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీని తప్పకుండా ఆడించాలని మాజీ క్రికెటర్‌ సయ్యద్ కిర్మాణీ అన్నారు. అతడికి ఎంతో అనుభవం ఉందని పేర్కొన్నారు. మెగా టోర్నీల్లో గెలుపునకు అతడి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అతి త్వరలోనే అతడు ఫామ్‌ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.


'విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) టన్నుల కొద్దీ అనుభవం ఉంది. అతడు కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలి. అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరికైనా కష్టమే. విరాట్‌ కచ్చితంగా గేమ్‌ ఛేంజర్‌ అవుతాడు. ఎక్కువ అనుభవం, సామర్థ్యం ఉన్న కోహ్లీలాంటి ఆటగాళ్లు ప్రపంచకప్‌ ఆడేందుకు కచ్చితంగా అర్హులే' అని సయ్యద్‌ కిర్మాణీ అంటున్నారు.


దేశానికి విరాట్‌ కోహ్లీ ఎంతో సేవ చేశాడని కిర్మాణీ పేర్కొన్నారు. అతడికి కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని సూచించారు. 'ప్రస్తుతం టీమ్‌ఇండియాలో పోటీ కఠినంగా ఉంది. ఇలాంటి సమయంలో కోహ్లీలాంటి పేలవ ఫామ్‌లో ఎవరైనా ఉంటే వెంటనే పక్కన పెట్టేస్తారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్న అనుభవజ్ఞులకు అవకాశాలు ఇవ్వడం న్యాయమే' అని ఆయన వెల్లడించారు.


మూడేళ్లుగా సెంచరీ చేయని కోహ్లీని దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు. అతడు త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు కలిస్తే కొన్ని సూచనలు ఇస్తానని సునిల్‌ గావస్కర్‌ సైతం పేర్కొన్నారు. 'విరాట్‌ కోహ్లీ 20 నిమిషాలు నన్ను కలిస్తే కొన్ని విషయాలు చెబుతాను. అవి అతడికి సాయపడొచ్చు. గ్యారంటీ ఇవ్వలేను గానీ చాలావరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆఫ్‌ స్టంప్‌ లైన్‌కు సంబంధించి చర్చించాలి. కొన్నేళ్ల పాటు ఓపెనర్‌గా ఇదే ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దీన్నుంచి బయటపడేందుకు కొత్తగా ప్రయత్నించాలి. అందుకే అతడు నన్ను కలిస్తే ఇవన్నీ చెబుతాను' అని గావస్కర్‌ అన్నారు.


పరుగులు చేయాలన్న తాపత్రయంతో ప్రతి బంతినీ ఆడాలని బ్యాటర్లు భావిస్తారని సన్నీ తెలిపారు. చాన్నాళ్లు పరుగులు చేయకపోవడంతో విరాట్‌ సైతం ఇలాగే ఆలోచిస్తున్నాడని అంచనా వేశారు. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడని వివరించారు. ఎప్పట్లాగే ఒకే విధంగా ఔటయ్యాడని పేర్కొన్నారు.


'విరాట్‌ విషయంలో తొలి పొరపాటే చివరిది అవుతోంది. ఎందుకంటే అతడు ఎక్కువగా రన్స్‌ చేయడం లేదు. ఎక్కువ స్కోరు చేయాలన్న  తాపత్రయంలో ఆడకూడని బంతుల్నీ ఆడేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో మాత్రం అతడు మంచి బంతులకే ఔటయ్యాడు. కోహ్లీ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో వేచి చూడాలి. అతడికి పొరపాట్లు చేసే హక్కుంది. 70 సెంచరీలు కొట్టిన అనుభవం అతడిది. అన్ని పరిస్థితుల్లో రాణించాడు' అని సన్నీ తెలిపారు.