ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు వాటి వల్ల జరుగుతున్న ఆత్మహత్య ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి లోన్ యాప్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఇతను ఫైర్ మేన్ సుధాకర్ గా పోలీసులు గుర్తించారు. సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక శాస్త్రిపురంలో రైలు కింద పడి ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోల్డెన్ రూపీ యాప్‌లో రూ.6 వేలను  సుధాకర్ అప్పు రూపంలో తీసుకున్నాడు. 


అయితే, తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో కొంత కాలంగా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో అడుగు ముందుకేసి, భార్య ఫోటోలు పోర్న్ యాప్‌లో పెడతామని బెదిరించారు. అందులో భాగంగా బంధువులు, స్నేహితులకు అసభ్యకర రీతిలో బాధితుడి పేరుపైన మెసేజ్‌లు పంపారు. బాధితుడు చేసేది లేక బాధితుడు సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన అన్నయ్యకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు.