IND vs WI, Rahul Dravid: టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సరికొత్తగా కనిపిస్తున్నారు! కుర్రాళ్లతో కలిసి లేటెస్టు ట్రెండ్స్‌ ఫాలో అవుతున్నారు. వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆయన 'హే ట్రెండ్‌'తో ఆశ్చర్య పరిచారు. శిఖర్ ధావన్‌ సహా ఆటగాళ్లతో కలిసి ఓ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో చేసి అలరించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.


అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు ఐపీఎల్‌ కోచ్‌గా దర్శనమిచ్చేవారు. ఆ తర్వాత ఎన్‌సీఏ ఛైర్మన్‌గా ఉండటంతో మీడియా ముందుకు రావడమే మానేశారు. గంగూలీ, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్, సెహ్వాగ్‌ వంటి మాజీలు ఏదో ఓ సందర్భంలో  కనిపిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచేవారు. ద్రవిడ్‌ మాత్రం అలా కాదు. అటు మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో ఆయన ఉనికే ఉండేది కాదు.  అలాంటిది టీమ్‌ఇండియా కోచ్‌ అయ్యాక కుర్రాళ్లతో కలిసి సరదాగా ఉంటున్నారు. అందులో లేటెస్టు ట్రెండ్స్‌ ఫాలో అవుతూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు.



శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఇప్పటికే వెస్టిండీస్‌ చేరుకుంది. రోహిత్‌, కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో వన్డే సిరీసుకు గబ్బరే కెప్టెన్సీ చేస్తున్నాడు. గయానాలో అడుగుపెట్టిన వెంటనే కుర్రాళ్లంతా కలిసి ఓ వీడియో చేశారు. 'హే ట్రెండ్‌'తో సందడి చేశారు. ఈ వీడియోను శిఖర్‌ ఇన్‌స్టాలో పంచుకున్నాడు.


వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ జులై 22న 27న ముగుస్తుంది. పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత జులై 29 నుంచి  ఐదు టీ20ల సిరీసు మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.


విండీస్‌తో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌


విండీస్‌తో వన్డే సిరీసుకు గత వారమే టీమ్‌ఇండియాను ప్రకటించారు. శిఖర్‌ ధావన్‌ జట్టును నడిపిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా ఉంటాడని పేర్కొన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్‌, షమి, హార్దిక్‌ పాండ్యకు రెస్ట్‌ ఇచ్చారు.