అహ్మదాబాద్ ఫ్రాంచైజీ జట్టు పేరు నిర్ణయించినట్టు తెలిసింది. 'అహ్మదాబాద్ టైటాన్స్'గా పేరు పెడుతున్నట్టు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగు మెగా వేలానికి ముందు పేరును ప్రకటిస్తారని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనం రాసింది.
ఇన్నాళ్లూ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్ జరిగేది. ఈ సీజన్ నుంచి పది జట్లు ఉండబోతున్నాయి. మూడు నెలల క్రితమే రెండు కొత్త జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్, లక్నో ఫ్రాంచైజీని ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకున్నాయి. ఇందుకోసం ఆ రెండు కంపెనీలు దాదాపుగా రూ.12వేల కోట్ల వరకు ఖర్చుచేశాయి.
కొన్ని రోజుల క్రితమే ఆర్పీ సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని లక్నో సూపర్‌జెయింట్స్ తమ పేరును ప్రకటించింది. లోగోను ఆవిష్కరించింది. హిందూ పురాణ వాగ్మయంలో కీలకమైన గరుడ, దేశభక్తిని చాటేలా మూడు రంగులతో కలిపి లోగోను సృష్టించారు. ఈ జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. అతడిని రూ.17 కోట్లు పెట్టి తీసుకున్నారు. అతడితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్, యువ మిస్టరీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసుకున్నారు.
Also Read: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!
Also Read: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!
అహ్మదాబాద్ టైటాన్స్ ఇంకా అధికారికంగా తమ పేరును ప్రకటించలేదు. కాగా ఈ జట్టు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది! అతడితో పాటు అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంది. పాండ్య, రషీద్‌కు చెరో రూ.15 కోట్లు చెల్లి్స్తుండగా శుభ్‌మన్‌కు రూ.8 కోట్లు ఇస్తున్నారు.
ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జట్ల ప్రతినిధులు బెంగళూరుకు చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. బహుశా ఐపీఎల్‌లో జరిగే ఆఖరి అత్యంత భారీ వేలం ఇదే కావొచ్చు.