చీకట్లను తొలగించి సమస్త లోకానికి వెలుగు ప్రసాదించేవాడు ఆదిత్యుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్య భగవానుడిని ప్రత్యక్షదైవంగా కొలుస్తారు. అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు సూర్యుడు అవతరించిన రోజే సూర్య జయంతిగా,రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. తిరుమలలో రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 8 నుంచి 9 గంటల వరకూ చంద్రప్రభ వాహనంపై విహరించడంతో వాహనసేవలు ముగుస్తాయి. కరోనా నిబంధనల మేరకు రథసప్తమి పర్వదినాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
సప్త వాహనాలు ఇవే..
ఉదయం 6 నుంచి 8.00 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ..
ఉదయం 9.00 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం..
ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు గరుడ వాహనం..
మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల నడుమ హనుమంత వాహనం..
మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 గంటల వరకు చక్రస్నానం (రంగనాయకుల మండపంలో)..
సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు కల్పవృక్ష వాహనం..
సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు సర్వభూపాల వాహనం..
రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం తో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి..
రథసప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు
వాహనసేవలు
- సూర్యప్రభ వాహనం- ఉదయం 7 గంటల నుంచి 7.30
- హంస వాహనం - ఉదయం 8 నుంచి 8.30
- అశ్వ వాహనం - ఉదయం 9 నుంచి 9.30
- గరుడ వాహనం - ఉదయం 9 నుంచి 10
- చిన్నశేష వాహనం- ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు
- స్నపనతిరుమంజనం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు
- చంద్రప్రభ వాహనం సాయంత్రం 6 నుంచి 6.30
- గజ వాహనం - రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు
మహా విష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు నిర్వహిస్తారు. తిరుమలలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన ఊరేగిస్తారు. సూర్యుడి దేవాలయాల్లో కోణార్క్, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా), మొధేరా (గుజరాత్) ప్రఖ్యాతమైనవి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయంటారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,అర్ఘ్యం అనే ప్రక్రియలు ప్రవేశపెట్టారు.