ఇండియన్ ప్రీమియర్ లీగు వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతంలో మాదిరిగానే నారింజ, నలుపు రంగుల మేళవింపుతో జెర్సీని విడుదల చేసింది. ఈ సారి రంగులు మరింత ముదురుగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఫ్రాంచైజీ వాటిని అభిమానులతో పంచుకుంది.
'కొత్త సీజన్, కొత్త జెర్సీ మామా' అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేసింది. సాయంత్రం 5:30 గంటల తర్వాత మీ ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. సాయంత్రం కాగానే కొత్త జెర్సీ చిత్రాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతానికి వాటిపై స్పాన్సర్ల వివరాలైతే కనిపించలేదు.
ఈ కొత్త జెర్సీపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొత్త దాంతో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ జెర్సీనే మెరుగ్గా ఉందని కొందరు అన్నారు. 'చిన్నప్పుడు తిన్న ఆరెంజ్ ఐస్‌క్రీములు గుర్తొస్తున్నాయి' అని మరొకరు ట్వీట్ చేశారు. కొందరు రస్నాతో పోల్చారు.
ఏదేమైనా గత సీజన్లో సన్‌రైజర్స్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగింది. ఈ సారైన మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకుంది. అంటే త్వరలో జరగబోయే వేలంలో ఆ ఫ్రాంచైజీ సరికొత్త జట్టును నిర్మించాల్సి ఉంది. మెరుగైన ఓపెనర్లు, బలమైన మిడిలార్డర్, దుమ్మురేపే బౌలర్లు, సిసలైన ఆల్‌రౌండర్లను ఎంచుకోవాలి. కొన్నేళ్లుగా హైదరాబాద్‌ను మిడిలార్డర్ కొరత వేధిస్తోంది.
Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?
Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్ కమిటీ ప్రకటన