'వర్షం', 'ఒక్కడు', 'మనసంతా నువ్వే', 'దేవి' 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'... ఇలా చెబితే నిర్మాతగా ఎంఎస్ రాజు ఎన్నో సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమకు అందించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. 'డర్టీ హరి' దర్శకుడిగానూ విజయం అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ '7 డేస్ 6 నైట్స్'.


'7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. ఆయన ఓ నిర్మాత కూడా! సుమంత్ అశ్విన్ సరసన కథానాయికగా మెహర్ చాహల్... రోహన్, క్రితికా శెట్టి మరో జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. 'ఇది భక్తి ట్రిప్ కాదన్నా! బ్యాచిలర్స్ ట్రిప్' అంటూ ట్రైలర్ స్టార్టింగులోనే సినిమా జానర్ ఏంటో చెప్పేశారు.


సినిమాలో రోహన్‌కు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో అతడు, సుమంత్ అశ్విన్ గోవాకు బ్యాచిలర్స్ ట్రిప్ వేస్తారు. పెళ్లి కుదిరినా... ఆ విషయం దాచి ఓ అమ్మాయికి రోహన్ లైన్ వేస్తాడు. సుమంత్ అశ్విన్ వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ గోవాలో ఏం జరిగింది? అనేది సినిమాగా తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే... యూత్‌ఫుల్‌గా, రొమాంటిక్‌గా ఉంది. దర్శకుడు కావాలనుకునే యువకుడిగా సుమంత్ అశ్విన్ కనిపించారు. 'ఈ అమ్మాయిలు, గిమ్మాయిలూ బంద్. చెప్పుతో కొట్టుకుంటా... మళ్లీ వాళ్ళ జోలికి వెళితే', 'ఈ లేడీస్ కొంచెం మొండి చేస్తారు కానీ ఇష్టం లేనట్టు కాదు. మనం సైలెంట్ ఉంటే వాళ్ళే కెలుకుతారు' వంటి డైలాగులు ట్రైలర్ లో ఉన్నాయి.


సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై '7 డేస్ 6 నైట్స్' సినిమా రూపొందింది. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే... కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని ఎంఎస్ రాజు తెలిపారు.