నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'అన్ స్టాపబుల్' షో ఎంతో పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ షోకి మోహన్ బాబు, నాని, రానా, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ ఇలా పేరున్న సెలబ్రిటీలు చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. వారిని తన ప్రశ్నలతో ఓ ఆట ఆడుకున్నారు బాలయ్య. ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. 


ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన 'అన్ స్టాపబుల్' షోలో ప్రతి ఒక్క ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది. త్వరలోనే ఈ షోకి కొనసాగింపుగా మరో సీజన్ రాబోతుందని ప్రకటించింది 'ఆహా' టీమ్. ఇప్పటికే బాలయ్య తన హోస్టింగ్ స్కిల్స్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. తాజాగా ఈ టాక్ షోతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు బాలయ్య. ఈ షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల‌ను సొంతం చేసుకుంది.


దీంతో 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా 'అన్ స్టాపబుల్' షో రికార్డు సృష్టించింది. బాలయ్య కారణంగానే ఈ రికార్డు సాధ్యమైందని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఇక సీజన్ 2 ఇంకెన్ని రికార్డు సృష్టిస్తుందో చూడాలి!


ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది.