మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నార్కోటిక్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్ విభాగాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ వైజింగ్ వింగ్ అనే రెండు పేర్లతో ఈ విభాగాలు ఉంటాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాలు సమాజంలో ఎంతో హాని కరంగా మారుతున్నాయని సీపీ చెప్పారు. గత నాలుగు నెలలుగా డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశాలు పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సీపీ ఆనంద్ చెప్పారు. 


జనవరి 28 న జరిగిన సీఎం సమావేశంలో డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ఠ చర్యలను చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. డ్రగ్స్ కింగ్ గా పేరొందిన టోనీ అరెస్ట్ అయిన తరువాత ఆ దందా జరుగుతున్న తీరుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ వ్యాపారవేత్తలతో టోనీకి సంబంధాలు కలిగి ఉండడంతో మొట్ట మొదటి సారిగా డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి, జైలుకి పంపించామని తెలిపారు.


అయితే, బుధవారం డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర సీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ వైజింగ్ వింగ్ అనే రెండు విభాగాలను ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు పని చేయనున్నాయి. విడతల వారిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కమిషనరేట్స్, ఆయా జిల్లా కేంద్రాల్లో నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారం జిల్లా కేంద్రాల్లో త్వరలో ఈ విభాగాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.