పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగుతోంది. దీనిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగంలో రెండు పెద్ద నిజాలు బయటికి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాంగ్రెస్, తప్ప టీఆర్ఎస్ కాదనే విషయం ప్రధాని మాటల ద్వారా తేలిపోయింది. బీజేపీ తెలంగాణను ద్వేషిస్తుంది, తెలంగాణ కోసం ఆ పార్టీ చేసింది ఏమీ లేదు.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి ట్వీట్‌లో డిమాండ్ చేశారు.


ప్రధాని వ్యాఖ్యలివీ..
కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విభజన చేయని కారణంగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సమస్యలు వచ్చాయని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చిన ప్రధాని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వైఫల్యాల ప్రస్తావలో ఏపీ విభజనపై కూడా మాట్లాడారు.  మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారని.. పార్లమెంటులో కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారని గుర్తు చేశారు. 


కాంగ్రెస్ పార్టీ విభజన జరిపిన తీరుతోనే ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని.. శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సోమవారం లోక్‌సభలో కూడా ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ కాంగ్రెస్‌ను బహిష్కరించారన్నారు.