USPC Protest Against Go 317: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ జీవో 317పై రగడ ఇంకా కొనసాగుతోంది. ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నేతలు దీక్షలు, ఒకరోజు నిరసనలు చేపట్టారు. నేడు ఉపాధ్యాయ సంఘాలు బరిలోకి దిగాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం విడుదలకు జారీ చేసిన జీవో 317ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) పోరాటానికి సిద్ధమైంది. జీవోపై నేడు ఇందిరా పార్క్ వద్ద యూఎస్‌పీసీ మహాధర్నా చేయనుంది.


తమ వినతులు పట్టించుకోకుండా ప్రభుత్వం తమ ఇష్ట ప్రకారం ఉద్యోగులను బదిలీ చేయడం, స్థానికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పడుతున్నాయి. నేడు యూఎస్‌పీసీ తమ డిమాండ్లను ప్రభుత్వానికి మరోసారి తెలియజేసేందుకు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 317లో ఉద్యోగుల స్థానికత అంశం ప్రస్తావన లేకపోవడం, ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు స్థానికతను శాశ్వతంగా కోల్పోయి సొంత జిల్లాలకు దూరమయ్యారని మండిపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా నేడు యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని సోమవారం నాడు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి చేపడుతున్న మహాధర్నాలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి డిమాండ్లు ఇవే..



  • ఉద్యోగులు సీనియారిటీ జాబితాలు, జిల్లాల కేటాయింపులో జరిగిన పొరపాట్లపై అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి

  • టీచర్ల సాధారణ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు సరైన విధంగా పూర్తి షెడ్యూల్‌ ప్రకటించాలి

  • జీవో 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను ఆప్షన్‌ ప్రకారం వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలి

  • కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగుల భార్య/ భర్తను కూడా పరిగణలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలి

  • ఉద్యోగుల పరస్పర బదిలీ (Mutual Transfer)లకు అనుమతి తెలుపుతూ జారీ చేసిన జీవో 21లో ఉమ్మడి జిల్లాలో నియమితులైన ఉపాధ్యాయులకు పాత సినియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. 


Also Read: AP New Districts: కొత్త జిల్లాల ప్రకటనతో ఆ నేతల్లో పెరుగుతున్న ఆశలు, ఇంతకీ ఎవరా నేతలు.. అసలు కథేమిటీ !


Also Read: High Court: తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి