రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో అడ్డగోలుగా మాట్లాడారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోందా పార్టీ. ఇప్పుడు నేరుగా ఆందోళనకు పిలుపునిచ్చింది హైకమాండ్.
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికక్కడ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
తెలంగాణవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపి దిష్టిబొమ్మల దహనం చేయాలన్నారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చిన కేటీఆర్.
ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు మూకుమ్మడిగా బీజేపీ విధానాలను తప్పుబడుతున్నారు. తెలంగాణ విభజనపై మోదీ తన అక్కసు వెళ్లగక్కారంటూ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని పోతారం జే గ్రామంలో దళితబంధు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్....తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడుతుంటే ప్రధాని మోదీ బాధపడుతున్నారన్నారు. మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు.
తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. విభజన తీరుపై తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, అమరవీరుల త్యాగాలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన సరిగ్గా జరగలేదు అనడం వెనుక తెలంగాణను ఎంత శత్రువుగా బీజేపీవాళ్లు, మోదీ చూస్తున్నారో అర్ధమవుతుందన్నారు.
బడ్జెట్ కేటాయింపుల్లోనే తెలంగాణ మీద ఉన్న ఈర్ష్య బయటపెట్టారని... స్వార్ధ రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు ప్రశాంత్‌రెడ్డి. తెలంగాణ బిజెపి నాయకులకు ఈ నేలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు . తెలంగాణ ప్రజల మనోభావాలు ఇక్కడి బీజేపీ నాయకులు గుజరాత్ మోదీ దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.
రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు బిజెపి వ్యతిరేకమని మరోసారి రుజువైందన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరమని ఆక్షేపణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోదీవ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని విమర్శించారు ఎర్రబెల్లి. ప్రజాస్వామ్యంపై బిజెపికి ఏమాత్రం నమ్మకం లేదని ఈ కామెంట్స్‌తో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణపై బీజేపీకి మోదీకి ఎందుకంత అక్కసని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యల చేస్తున్నారని కామెంట్ చేశారు. మోడీ ప్రధానమంత్రిగా ఉండి అలా మాట్లాడడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నిలదీశారు.
అటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మోదీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్‌నేతల చేతకాని తనమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ల అలసత్వం వల్లే మోదీ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారని ఆక్షేపించారు.