AP New Districts: కొత్త జిల్లాల ప్రకటనతో ఆ నేతల్లో పెరుగుతున్న ఆశలు, ఇంతకీ ఎవరా నేతలు.. అసలు కథేమిటీ !

Ap New Districts: జిల్లా ఏర్పడితే తమ నాయకుడిదే పైచేయి అంటూ ఆ నేత అనుచురులు చెప్పుకుంటున్నారు. కొందరైతే ఖచ్చితంగా ఈ సారి తమ నాయకుడే మంత్రి అవుతారని భావిస్తున్నారు.

Continues below advertisement

AP New Districts: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ అంవం తెరపైకి వచ్చినప్పుడల్లా రాష్ట్ర మంత్రుల్లో టెన్షన్ పెరుగుతుంటే.. ఇక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేల్లో‌ మాత్రం కొత్త జిల్లా ప్రకటన మరిన్ని ఆశలు పెంచుతోంది. కొందరు నేతలైతే అధిష్టానం చూపు తమవైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా సీఎం‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను పట్టించుకోకపోతారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Continues below advertisement

ఇక కొత్త జిల్లా ప్రకటన అలా రాగానే చిత్తూరు జిల్లాలో ఆ నేతల అనుచరులు మాత్రం ఊహల్లో తేలిపోతున్నారు. జిల్లా ఏర్పడితే తమ నాయకుడిదే హవా ఉంటదని గుస గుస లాడుకుంటున్నారు. ఇక చంద్రగిరిని కలుపుకుంటూ తిరుపతి‌ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానుంది. అయితే ఈ కొత్త జిల్లాకు శ్రీ బాలాజీ జిల్లాగా ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. శ్రీ బాలాజీ జిల్లా పరిధిలో తిరుపతి సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. వీటిలో సర్వేపల్లిని తొలగిస్తూ.. అందుకు బదులుగా చిత్తూరు జిల్లాలోని తిరుపతికి అతి సమీపంలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గంను చేర్చినట్లు ప్రచారం మొదలైంది. ఈ విషయం కాస్తా బయటకు పొక్కగానే అధికార పార్టి నేతలు ఆశలు మరింత పెరిగాయి.

జిల్లా ఏర్పడితే తమ నాయకుడిదే పైచేయి అంటూ ఆ నేత అనుచురులు చెప్పుకుంటున్నారు. కొందరైతే ఖచ్చితంగా ఈ సారి తమ నాయకుడే మంత్రి అవుతారని భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ బాలాజీ జిల్లాలో తిరుపతి‌ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలు ఉన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వారు ‌కొందరైతే, వైఎస్సార్ కుటుంబానికి అతి సన్నిహితంగా ఉండే నేతల్లో ముఖ్యులుగా భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. 

చిత్తూరు జిల్లాలో మాత్రం నేటికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా మాత్రం అలానే కొనసాగుతూ వస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటే అధిష్టానం వద్ద చెల్లుతున్నట్లుగా స్థానిక నేతలు చెబుతుంటారు. ఎన్నో ఏళ్ళుగా పదవులపై ఆశలు పెట్టుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తుడా ఛైర్మన్, ప్రభుత్వ విప్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా వివిధ పదవులు దక్కాయి. కరుణాకర్ రెడ్డికి మాత్రం టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాత్రమే పదవి దక్కింది. పార్టిలో సీనియర్ నేత కావడంతో ఎలాగైనా ఈ సారి తమ నేతకు మంత్రి వర్గ విస్తరణలో సీటు ఖాయమని ఆయన అనుచరులు సైతం ఆశలు పెట్టుకున్నారు. 

కొత్త జిల్లా ఏర్పాటు బాగా కలిసి వస్తుందని మంత్రి పదవి ఆశావాహులు ధీమాతో ఉన్నారు. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి హవా కొంతవరకూ తగ్గే అవకాశం ఉందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తన మనసులో మాట వెల్లడించినట్లు పార్టీ కేడర్ చెప్పుకుంటోంది. దీనికి తోడు జిల్లాలో పెద్ద నేతగా చెప్పుకునే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు కూడా ఉండడంతో కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నియోజకవర్గం నేతలు భావిస్తున్నారు. 

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం‌ ఎలాగైనా క్యాబినెట్లో సీటు సంపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. స్ధానికంగా ఉన్న ప్రజలకు రోజు రోజుకు దగ్గర అయ్యేందుకు ఏదోక కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తూ నిత్యం వారి మధ్యనే ఎక్కున సమయం గడుపుతున్నారు.. ఎవరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నా మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటికీ కదా అని కొందరు కొట్టి పారేస్తున్నారు.. మంత్రి వర్గ విస్తరణలో పాత ప్రతిపాదన కొనసాగిస్తారా..లేక కొత్త ప్రతిపాదన కొనసాగిస్తారా అనే ప్రశ్న మాత్రం మెదులుతుంది.

Also Read: AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...

Also Read: AP New Districts: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!

Continues below advertisement