ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు మరోసారి వెలుగులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఉగాదిలోపు ఈ ప్రక్రియ పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది.  అయితే జనాభా లెక్కల సేకరణ ఇంకా పూర్తికాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చవద్దని కేంద్ర మార్గదర్శకాలు ప్రస్తుతానికి అమల్లో ఉన్నాయి. 2021 మే నాటికి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తి కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. 


కొత్తగా 13 జిల్లాలు


రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ స్థానం భౌగోళికంగా ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉండడంతో దానిని రెండు జిల్లాలుగా విభజించాలని గతంలో సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా చేస్తే రాష్ట్రంలో కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read: నేడే మహిళల ఖాతాల్లో నగదు జమ... ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్


ఉగాదిలోపు ప్రకటన..!


కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ పై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తుంది. ఈ సూచనల మేరకు అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం జిల్లాల పునర్వ్యస్థీకరణ తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడినట్లు ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఈలోపు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ ప్రక్రియను ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాలను ప్రకటించాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. 


Also Read: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు