గ‌రుడ వాహనంపై సకలలోక రక్షకుడు.. 


ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌రకు శ్రీనివాసుడు గ‌రుడ వాహనంపై అనుగ్రహించారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు.. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి..


















హనుంతు వాహనంపై అభయహస్తం


మ‌ధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల వ‌రకు హ‌నుమంత వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి ద‌ర్శ‌న‌మిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.






శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం..


మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు.. అనంత‌రం ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు.






క‌ల్ప‌వృక్ష వాహనంపై మ‌ల‌య‌ప్ప స్వామి..
        
సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వరకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్ప స్వామి క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై దర్శనమిచ్చారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పికలు ఉండవని ప్రతీతి. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అలాంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి మలయప్ప స్వామి వారు భక్తులను అనుగ్రహించారు.



స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం..


క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామి స‌ర్వ‌భూపాల వాహ‌నంలో దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు..