రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమాలో భోజనం హోటల్ ముందు తల ఒక్కింటికీ రూ.10 అని రాసి ఉంటుంది. అప్పుడు హీరో రాజేంద్రప్రసాద్ కోడిని తీసుకెళ్లి మూడు టికెట్లు తీసుకుని సీక్రెట్ గా ఏనుగుకు భోజనం పెట్టిస్తాడు. తల ఒక్కింటికీ రూపాయి అని నువ్వే రాశావ్ అని హోటల్ యజమానిని బురిడీ కొట్టిస్తారు. కానీ ఇక్కడ కాస్త సీన్ రివర్స్. ఏ తల ఒక్కింటికీ టికెట్ కొట్టాల్సిందే అని ఆర్టీసీ బస్సు కండెక్టర్ కోడిపుంజుకు టికెట్ కొట్టారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 


కోడిపుంజుకు రూ.30 టికెట్


ఆర్టీసీ బస్సులో నిర్ణీత బరువు దాటితో లగేజ్ కు టికెట్ కొడతారు. కానీ ఓ బస్సు కండెక్టర్ అత్యుత్సాహంతో కోడి పుంజుకు టికెట్ కొట్టి ప్రయాణికుడికి షాకిచ్చాడు. కోడిపుంజుకు టికెట్ ఏమిటీ అని ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు తప్పనిపరిస్థితులో టికెట్ ధర చెల్లించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆర్టీసీ బస్ కండెక్టర్ నిర్వాకం ఇప్పుడు వైరల్ అవుతోంది. మహ్మద్ అనే వ్యక్తి గోదావరిఖని నుంచి కరీంనగర్‌ వెళ్లేందుకు ఆర్టీసీబస్సు ఎక్కాడు. అతడితో సంచిలో కోడిపుంజును తీసుకెళ్తున్నాడు. అయితే ఆ కోడిపుంజుకు రూ.30 బస్సు టికెట్ కొట్టి కండెక్టర్ ప్రయాణికుడికి షాకిచ్చాడు. చివరకు ఏంచేయాలో తెలియక మహ్మద్ తన కోడిపుంజుకు కూడా రూ.30 చెల్లించి బస్సులో ప్రయాణించాడు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. 






సజ్జనార్ స్పందన


ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు టికెట్ ఫొటోతో ఉన్న వార్తను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు టాగ్ చేశారు. ఆర్టీసీలో ఇలాంటి రూల్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని పరిశీలిస్తామని బదులిచ్చారు.    


గతంలోనూ ఇలాంటి ఘటన


కర్ణాటక రాష్ట్రంలో కోడి పిల్లకు టికెట్ కొట్టిన ఘటన గతంలో వైరల్ అయింది. పది రూపాయలు పెట్టి కొన్న కోడిపిల్లకు ఆర్టీసీ కండెక్టర్ రూ.50 టికెట్ కొట్టారు. దీంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. కోడి పిల్లకు టికెట్ ఏంటీ అని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.