తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్‌లా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల డ్రామాలు ప్రజలు నమ్మరని.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో తమకు కేసీఆర్ అస్త్రం అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగి రాయాలని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న రాజ్యాంగంతో ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని.. కారణం ఇప్పటికి వరకు చెప్పలేదని అన్నారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్తామని అన్నారు. కాంగ్రెస్‌ను తిడితే టీఆర్ఎస్‌కు నొప్పి ఏంటో అర్ధం కావడం లేదని బండి సంజయ్ విమర్శలు చేశారు.


ప్రధాని మోదీ ఏమైనా తెలంగాణ బిల్లును అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని.. పెప్పర్ స్ప్రే కొట్టినా పారిపోకుండా తెలంగాణ బిల్లుకు నిలబడింది సుష్మాస్వరాజ్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కాబినెట్‌లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని నిలదీశారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు.


కేసీఆర్ సెంటిమెంట్ ఎవరు నమ్మబోరని తెలిపారు. నీళ్లపై అన్యాయం జరిగితే ఎవరూ మాట్లాడబోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీ క్రిష్ణా నదిపై ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఫౌం హౌస్‌లో పండుకున్నారా అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసిందని.. వారు ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం కాదు, కేసీఆర్ విగ్రహం పెట్టుకుంటారా? అని అన్నారు. తెలంగాణ విభజనను ప్రధాని మోదీ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కేసీఆర్ కలిసినప్పుడు విభజన హామీలు గుర్తుకు రాలేదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.


బీజేపీ హయాంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎక్కడా పెప్పర్ స్ప్రే కొట్టలేదని, కానీ ఏపీ విభజన బిల్లు సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకులు పెప్పర్ స్ప్రే కొట్టినా సుష్మా స్వరాజ్ భయపడలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారని అన్నారు. కృష్ణా జిల్లాలో 279 టీఎంసీల కోసం కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టాడని బండి సంజయ్ నిలదీశారు. ప్రధాని మోదీని టీఆర్ఎస్ ఏ స్థాయిలో తిడితే అదే స్థాయిలో తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.