టీమ్‌ఇండియా సరికొత్త టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మనే ఎంపిక చేస్తున్నారని సమాచారం! బీసీసీఐ సెలక్టర్లు అతడి పట్లే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీసుకు ముందు అతడి పేరును ప్రకటిస్తారని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. విరాట్‌ కోహ్లీ వందో టెస్టులో రోహిత్‌ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు.


దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత విరాట్‌ కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అతడు హఠాత్తుగా ఈ విషయం వెల్లడించడంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఆశ్చర్యపోయారు. దాంతో తర్వాతి కెప్టెన్‌గా ఎవరుంటే బాగుంటుందన్న చర్చ జరిగింది.


కొందరు రిషభ్‌ పంత్‌కు పగ్గాలు అప్పగించాలని అన్నారు. మరికొందరు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌ చేయాలని సూచించారు. మరికొందరైతే జస్ప్రీత్‌ బుమ్రా పేరునూ తీసుకొచ్చారు. ఫిట్‌గా ఉంటే రోహిత్‌ శర్మనే కొనసాగించాలని మరికొందరు పేర్కొన్నారు.


Also Read: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!


Also Read: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!


'టీమ్‌ఇండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరును ప్రకటించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారు. విరాట్‌ కోహ్లీ వందో టెస్టులో రోహిత్‌ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా అరంగేట్రం చేయనున్నాడు' అని క్రిక్‌బజ్‌, ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ కథనాలు ప్రచురించాయి. మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటనకు వస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీసుకు ముందు అతడి పేరును ప్రకటించనున్నారు.


వాస్తవంగా రెండేళ్ల క్రితం వరకు రోహిత్‌కు టెస్టు జట్టులో నిలకడ లేదు. మిడిలార్డర్లో పరుగులు ఎక్కువ చేసేవాడు కాదు! ఎప్పుడైతే దక్షిణాఫ్రికాపై సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌గా ప్రస్థానం మొదలు పెట్టాడో అతడి బ్యాటింగ్‌ తీరు పూర్తిగా మారిపోయింది. వరుసగా సెంచరీలు చేస్తున్నాడు. కొత్త బంతిని బాగా ఆడుతున్నాడు. నిలకడ ప్రదర్శిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే గాయపడటంతో దొరికిన సమయంలో బరువు తగ్గాడు. ఫిట్‌గా మారాడు. ఇప్పుడు విండీస్‌పై జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.