గత మూడు రోజులుగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో తిరుమల వెళ్లే భక్తులు కలవరపడుతున్నారు. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవని, గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో ఏనుగులు కూడా సంచరిస్తున్నాయని భక్తులు అంటున్నారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు, భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగుల సంచారం కారణంగా శనివారం రాత్రి అర్ధ గంట పాటు తిరుపతికి వెళ్లే వాహనాలను నిలిచిపోయాయి. ఏనుగులు భక్తులకు ఎటువంటి హాని తలపెట్టకపోయినా అవి ఎక్కడ దాడి చేస్తాయో అని టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మొదటి ఘాట్ లో గజరాజులు
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం సహాజమైన విషయమే. కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో నిత్యం ఏనుగులు పంటపొలాలను ధ్వంసం చేస్తుంటాయి. అయితే కొత్తగా ఇప్పుడు తిరుమల కొండ పైన ఏనుగులు కనిపించడంతో కలకలం రేగింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ఆర్చ్, ఏడో మైలు ఆంజనేయస్వామి విగ్రహం ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తుంది. రాత్రి ఏనుగులు రోడ్డుపైకి రావడంతో ఆ సమయంలో తిరుపతికి వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏనుగుల సంచారం విషయాన్ని వాహనచోదకులు టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద అర్ధగంట పాటు వాహనాలను నిలిపివేశారు. అనంతరం ఏనుగులను అడవిలోకి తరిమి వేసి వాహనాలకు అనుమతి ఇచ్చారు.
ఏనుగులను గమనించడానికి ప్రత్యేక సిబ్బంది
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గత మూడు రోజులుగా ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి. దిగువ దారిలో వచ్చే ఆంజనేయ స్వామి ఆలయం పరిసరాల్లో ఐదు ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. ఘాట్ రోడ్డు మార్గమే కాకుండా కాలినడక మార్గం కూడా అక్కడి నుంచే వెళ్తున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగులు ఉన్న పరిసర ప్రాంతాన్ని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఏనుగులను ఎప్పటికప్పుడు గమనించడానికి ప్రత్యేక ఫారెస్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు.
ఈ జిల్లాల్లో ఎక్కువగా
రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గజరాజుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఏనుగులు పంట పొలాలను నాశనం చేసిన వార్తలు వింటుంటాం. ఏనుగులు పంటలను పాడుచేయకుండా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను స్థానికులు కోరుతుంటారు. అడవిలో నీళ్ల కొరత కారణంగా ఏనుగులు గ్రామాల్లోకి వస్తుంటాయని అటవీ అధికారుల చెబుతున్నారు. అడవుల సమీపంలోని గ్రామాల్లోకి తరచూ ఏనుగులు వస్తుంటాయని, ఏనుగుల గుంపులను దారి మళ్లించేందుకు చర్యలు చేపడతామని అటవీ అధికారులు స్పష్టం చేశారు.