చుట్టూ ప్రకృతి సోయగం, ఎత్తైన ప్రదేశంలో కనిపించే గ్రామం సోపూర్. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌లో ఉంది. ఈ అరుదైన భౌతిక లక్షణమే ఈ గ్రామానికి శాపంగా మారింది. అక్కడ ఓ గ్రామం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అభివృద్ధి అంటే తెలియని పల్లెటూరుగా మిగిలిపోయింది.
తెలంగాణ పరిధిలో ఉండే సోపూర్ గ్రామంలో మూడు భాషలు మాట్లాడతారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మధ్య జీవనం సాగిస్తున్నారు ఈ గ్రామస్తులు. చాలా వెనుగబడిన గ్రామం ఇది. సోపూర్‌లో తెలుగు మీడియం స్కూల్ ఐదో తరగతి వరకే ఉంది. తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్తారు. కానీ ఇక్కడి వాళ్లకు ఆ పాఠాలు బుర్రకెక్కవు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభావం ఎక్కువగా ఉన్న వీళ్లకు తెలుగు చదవడం పూర్తిగా రాదు.
కనీసం ప్రాథమిక చదువే సాగని ఆ ఊరిలో ఉన్నత చదువుల మాటే వినిపించదు. అర్థం కాని చదువులు చదవలేక చాలా మంది చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో పనికి వెళ్తున్నారు.
కేవలం వ్యవసాయంపైనే అధారపడి జీవించే సోపూర్ గ్రామ ప్రజలు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ పత్తి, తొగర్లు పండిస్తారు. వాటిపైనే జీవనం సాగిస్తారు. గ్రామంలో దాదాపు 400 ఇళ్లు ఉంటాయి. 1000 వరకూ జనాభా ఉంటుంది. కనీస వసతులు మాత్రం మచ్చుకైనా కనిపించవు. గ్రామం మొత్తానికి ఒకే బోరు ఉంటుంది. అక్కడికి వెళ్లే తాగు నీరు ఇతర అవసరాలకు వాడుకుంటారు.
వీధి లైట్లు కూడా సరిగా ఉండవు. నాలాలు లేవు. ప్రజలు ఇంకా అనాగరిక జీవితాన్ని గడుపుతున్నారు. విభిన్న సంస్కృతుల మధ్య వీరి జీవనం సాగుతోంది. బోర్డర్‌లో ఉన్న ఈ గ్రామంలో కనీసం హెల్త్ సెంటర్ కూడా లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే జుక్కల్ మండలం కేంద్రానికి వెళ్లాల్సిందే. రోగులను తీసుకెళ్లేందుకు కూడా రవాణా సౌకర్యం లేదు. అర్థరాత్రి ఏదైనా ఆపద వస్తే రాత్రంతా ఊరిలో జాగారం చేయాల్సిందే. తెల్లవారితేనే ఊరి నుంచి బయటపడి వైద్యుడికి చూపిస్తారు. ఇలాంటి దుస్థితిలో గర్భిణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆ ఊరికి వచ్చేది ఒకే ఒక్క టీఎస్‌ఆర్టీసీ బస్సు. అది కూడా స్కూల్స్ తెరిచి ఉన్నప్పుడే వస్తుంది. స్కూల్స‌్‌కు సెలవులు ఇస్తే బస్సుకు కూడా సెలవులే. ఆ టైంలో ఇక్కడి ప్రజలు వేరే ప్రత్యామ్నాయాల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. కర్ణాటక నుంచే వచ్చే రెండు బస్సులే వీళ్లకు దిక్కు. దానికి కూడా టైమింగ్స్ ఉండవు.
ఈ గ్రామం తెలంగాణ బోర్డర్ లో విసిరేసినట్లుగా ఉండటంతో పాలకులు సైతం ఈ గ్రామాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయ్. గ్రామంలో కనీసం సీసీ రోడ్లు కూడా లేవు. వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నారు.