మంచి జీతం, ఉన్నతమైన ఉద్యోగం అని మధ్యవర్తుల మాయమాటలు నమ్మి దుబాయ్‌కి వెళ్లిన వారు నరకయాతన పడి తిరిగొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొందరు అక్కడి నుంచి సొంత దేశానికి తిరిగి రాలేక ఇంకా మగ్గిపోతూనే ఉన్నారు. ఇక పని కోసం మహిళలు అక్కడికి వెళ్లి ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శారీరకంగా, మానసికంగా లైంగికంగా వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఈ నరకం అనుభవించి ఎలాగొలా బయటపడ్డ వారు చాలా మంది ఉన్నారు. దుబాయ్‌లో తమ లాంటి పని కోసం వెళ్లిన మహిళలను అక్కడి యజమానులు ఎలా చూస్తారో గతంలో ఎంతో మంది బాధితురాళ్లు ఆవేదన చెందారు. తాజాగా నిజామాబాద్‌కు చెందిన మహిళ అక్కడ అలాంటి వేదననే అనుభవిస్తోంది.


నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ ఇక్కడే ఉన్నప్పుడు కొన్ని ఇళ్లలో పని చేసి జీవితాన్ని వెళ్లదీసేది. మస్కట్‌లో పని అంటే మంచి జీతం, కుటుంబం బాగుంటుందని ఆశ పడింది. తీరా మధ్యవర్తి ద్వారా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. తన వేదననంతా వీడియో ద్వారా కుటుంబంతో పంచుకుంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన అర్జున్, లక్ష్మి బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి వలస వచ్చారు. అక్కడే అప్పటి నుంచి నివాసం ఉంటున్నారు.


Also Read: BJP MLA News: 14 ఏళ్లుగా బీజేపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు.. మహిళ ఫిర్యాదు, రివర్స్ కేసు పెట్టిన ఎమ్మెల్యే


ఆర్మూర్‌లో లక్ష్మి ఇళ్లలో పని చేసేది. నిజామాబాద్‌కు చెందిన సల్మా అనే ఏజెంట్ మస్కట్‌లో మంచి పని ఉందని లక్ష్మికి చెప్పింది. సల్మా మాటలను నమ్మిన లక్ష్మి సరేనని ఒప్పుకుంది. మంచి జీతం ఉంటుందని, తాను కష్టపడ్డా కుటుంబం బాగుపడుతుందనే కోటి ఆశలతో మస్కట్‌కు వెళ్లింది. అయితే ఏజెంట్‌ సల్మా.. లక్ష్మిని మస్కట్‌లో ఎవరికో అమ్మేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ తనను రెండు నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని లక్ష్మి తమకు వీడియో పంపినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లో లక్ష్మి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు నిజామాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఎలాగైనా తమకు సాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.


Also Read: Guntur Crime: లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళపై లైంగిక దాడికి యత్నం!