సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు సార్లు మంత్రి పేర్ని సీఎం జగన్‌ను కలిసి వివరించారు. సినిమా టికెట్ల పై ప్రభుత్వ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై సీఎం జగన్ సినీ ప్రముఖులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
టిక్కెట్ రేట్లు పెంచాలని కమిటీ నివేదిక !
సినిమా టిక్కెట్ ధరలపై హైకోర్టు సూచనలతో ప్రభుత్వం నియమించిన కమిటీ పేర్ని నానికి నివేదిక సమర్పించారు. టికెట్ ధరలు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లలో పెద్దగా మార్పులు లేవు. కానీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెంచాలని సూచించారు. ఏ ప్రాంతం అయినా సరే, నాన్ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర రూ. 30 ఉండాలని సిఫారసు చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే ఉంది. అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25రూపాయలు అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను రూ. 70 కు రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని సీఎం జగన్ పరిశీలించాల్సి ఉంది.
టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు !?
చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్‌తో ఎవరెవరు భేటీ అవబోతున్నారన్న అంశం ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఈ సమావేశంలో చిరంజీవితో పాటుగా నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలూ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. టికెట్ రేట్లు తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సమస్య మొదలైంది. ఇప్పుడు ఆ జీవోని సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రభుత్వం వద్ద రెడీగా ఉంది. నటులే కాకుండా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరవుతారని భావిస్తున్నారు.
టిక్కెట్ రేట్లు కాదు ఆన్ లైన్ టిక్కెట్లే సమస్య అన్న తమ్మారెడ్డి భరద్వాజ !
జగన్‌తో టాలీవుడ్ బృందం భేటీ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ ప్రదాన సమస్య.. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి అన్ లైన్ వ్యవస్ద పెట్టాలన్నది మా ఆలోచన అని వివరించారు. టికెట్ రేట్లు తెలంగాణ లో పెంచారు. తగ్గించటం లేదు. దాని వల్ల ఇక్కడ సినిమాలను చూడటం తగ్గించారు. ఆంధ్రాలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువగా చూశారని విశఅలేషించారు. 5 వ ఆట పెడితే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందని అడుగుతామన్నారు. ఆంధ్ర ,తెలంగాణ ప్రభుత్వాలను సబ్సిడిలను అడుగుతున్నాము. ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు ఛాంబర్ ఉందని ఏదైనా ఇండస్ట్రీ మంచి కోసమేనని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.