టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సుమంత్ కి మధ్యలో అవకాశాలు తగ్గాయి. 'మళ్లీ రావా' సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. ఆ తరువాత మళ్లీ ఫ్లాపులే పలకరించాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకొని 'మళ్లీ మొదలైంది' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడాకుల కాన్సెప్ట్ తో తెరకెక్కింది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన లాయర్ తో ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా.
సినిమా కాన్సెప్ట్ విడాకుల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్రమోషన్స్ లో సుమంత్ విడాకుల గురించి మాట్లాడాల్సి వచ్చింది. చాలా ఏళ్ల క్రితం నటి కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. పెళ్లైన కొన్నాళ్లకే ఆమె నుంచి విడిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో విడాకులు కామన్ అయిపోయాయని అంటున్నారు సుమంత్.
తనకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారని.. తన ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయని అన్నారు. దురదృష్టవశాత్తు విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయిందని.. ఈ విషయంలో దురదృష్టం అనే పదం కూడా వాదాలనుకోవడం లేదని.. అలా జరుగుతున్నాయంతే అంటూ చెప్పుకొచ్చారు. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి మాత్రం కష్టాలున్నప్పటికీ అడ్జస్ట్ అయిపోతున్నారని.. ఎందుకంటే రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయిందనే ముద్ర పడిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఎలాగోలా రెండో పెళ్లి కొనసాగించాలనుకుంటున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
అక్కినేని ఫ్యామిలీలో ఈ మధ్యనే నాగచైతన్య-సమంత విడిపోయారు. దీంతో సుమంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక 'మళ్లీ మొదలైంది' సినిమా విషయానికొస్తే.. ఇందులో నైనా గంగూలీ, వర్షిణి సౌందర్ రాజన్ హీరోయిన్లుగా నటించారు. టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ5లో ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.