గర్భధారణ సమయంలో ప్రతి మహిళ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజమే. శారీరకంగా, మానసికంగా ఆ మార్పులకు మహిళలు సిద్ధంగా ఉంటారు. ఈ సోషల్ మీడియా జమానాలో మహిళలు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాజల్ అగర్వాల్ చేసిన పోస్ట్ చూస్తే తెలుస్తోంది. గర్భధారణ సమయంలో శరీరంలో చోటు చేసుకునే మార్పులపై ఆమె అగర్వాల్ చేసిన పోస్ట్ హృదయాలను తాకేలా ఉంది. ముఖ్యంగా విమర్శకుల నోటికి సింపుల్‌గా చెక్ పెట్టార‌ని చెప్పవచ్చు.


ఇటీవల చెల్లెలు నిషా అగర్వాల్ కుమారుడితో కాజల్ అగర్వాల్ ఒక యాడ్ చేశారు. అందులో ఆమె బేబీ బంప్‌తో ఉన్నారు. అయితే... చాలా మంది ఆమె శరీరాకృతి గురించి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. లావైందని కొందరు, ఆ డ్రస్ ఏంటని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ అటువంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ పోస్ట్ చేశారు.


"నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంటిలో... ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పులతో ముందుకు వెళ్తున్నాను. ఈ సమయంలో కామెంట్లు, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్‌లు నాకు  నిజంగా సహాయం చేయవు. అందరం దయతో ఉండడం నేర్చుకుందాం. ఇతరుల పట్ల దయతో ఉండటం కష్టం అయితే... మీరు జీవించండి. ఇతరుల్ని జీవించనివ్వండి" అని కాజల్ అగర్వాల్ పోస్ట్ చేశారు. విమర్శలకు ఈ విధంగా సమాధానం చెప్పారు.


గర్భవతులు పరిస్థితి గురించి విమర్శలు చేసేవాళ్లను కాజల్ అగర్వాల్ మూర్ఖులుగా అభివర్ణించారు. జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళలకు, ముఖ్యంగా అర్థం చేసుకోలేని మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే... అంటూ మహిళల్లో ధైర్యం నింపేలా మంచి మాటలు చెప్పారు.


"గర్భధారణ సమయంలో మనం బరువు పెరుగుతాం. మనలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు ఉంటాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ పొట్ట పెద్దది అవుతుంది. శిశువుకు తగినట్టుగా శరీరం సిద్ధమవుతుంది. కొందరికి శరీరం పెద్దదైన చోట స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు చర్మం చిట్లవచ్చు. ఎక్కువ అలసిపోతాం. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు, నెగెటివ్ మూడ్ వల్ల అనారోగ్యం పాలవుతాం. మన శరీరానికి కూడా మంచిది కాదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతకు ముందులా... మునుపటి స్థితికి శరీరం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒక్కసారి రాకపోవచ్చు కూడా! ఈ  మార్పులు అన్నీ సహజమైనవి. చిన్నారుల రాక కోసం ఎదురు చూసేటప్పుడు, ఒకరికి జన్మ ఇవ్వడానికి కష్టపడుతున్నప్పుడు... ఈ మార్పులను మనం అసాధారణంగా భావించాల్సిన అవసరం లేదు. ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదు! చిన్నారికి జన్మనివ్వడం అనేది ఒక వేడుక. అది గుర్తుంచుకోబవాలి" అని కాజల్ పోస్ట్ చేశారు.